పరుగులు పెట్టే బసవన్నల పొగరణిచేందుకు.. కాలుదువ్వే కోడెగిత్తలను కట్టడి చేసేందుకు తమిళయువత సిద్ధమైంది.. ఎగిరిదూకే ఎద్దులను లొంగదీస్తూ.. వీరత్వాన్ని చాటే ఈ జల్లికట్టుకు అలంగానల్లూరు వేదికవుతోంది. లక్షలాది కళ్లలో ఆనందం నింపేందుకు, బహుమతులు ఒడిసిపట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన కుర్రాళ్లు సైరా.. బసవా.. సైసైరా బసవా అంటూ తొడగొడుతున్నారు.
సాక్షి, చెన్నై: ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో తమిళ యువత వీరత్వాన్ని చాటే జల్లికట్టుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో ఆల్‌రౌండ్ విజేతగా నిలిచే వారికి సీఎం స్టాలిన్ నేతృత్వంలో కారును కానుకగా సమర్పించనున్నారు.
జల్లికట్టు అంటే అలంగానల్లూరే..
మహోద్యమంతో తమ సంప్రదాయ క్రీడకు అను మతి సాధించుకున్నా, కోర్టు విధించిన ఆంక్షల్ని నిర్వాహకులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా కరోనా థర్డ్‌వేవ్‌తో జల్లికట్టు సాగేనా అన్న ప్రశ్న కూడా ఎదురైంది. అయితే, నిబంధనలు మరింత కఠినం చేసి జల్లికట్టుకు మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేసింది. భోగి రోజున పుదుకోట్టైలో, పొంగల్ పండగ రోజున అవనీయాపురంలో, కనుమ పండగ రోజున పాలమేడులో జల్లికట్టు హోరెత్తింది. ఇక, ఆదివారం కానుంపొంగళ్ రోజున ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆలంగానల్లూరులో జల్లికట్టుకు జరగాల్సి ఉన్నా, సంపూర్ణ లాక్‌డౌన్ అడ్డొచ్చింది. దీంతో ప్రభుత్వ నేతృత్వంలో అలంగానల్లూరు జల్లికట్టును సోమవారం నిర్వహించేందుకు నిర్ణయించారు. తేని, దిండుగల్, మదురై, శివగంగై, విరుదు నగర్, తిరుచ్చి, రామనాథపురం, తూత్తుకుడి, తంజావూరు జిల్లాల నుంచి పేరు గడించిన రైతులు, ప్రజా ప్రతినిధులకు చెందిన రంకె లేస్తూ బసవన్నలు ఇక్కడి కదనరంగంలోకి దిగనున్నాయి.
చదవండి: (Weekend Curfew: బెంగళూరులో నిశ్శబ్దం)
ఇక్కడి మునియాండి స్వామి, ముత్తాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం జల్లికట్టును ప్రారంభిస్తారు. తొలుత మునియాండి స్వామి ఆలయ ఎద్దును వదులుతారు. దానిని పట్టుకునేందుకు యువ క్రీడా కారులు శ్రమించాల్సిందే. అనంతరం ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వచ్చి ఎద్దులు దూకుడుగా ముందుకు సాగుతాయి. తామేమీ తక్కువ తిన్నామా.. అన్నట్టు క్రీడా కారులు వాటిని పట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇక కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రీడాకారుల, ఎద్దుల యజమానులు, నిర్వహకులు, ఇప్పటికే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేసి.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లను సమర్పించారు. ఇక, సంక్రాంతి సంబరాలను ఇళ్లల్లోనే జరుపుకున్న జనం, కానుం పొంగల్ రోజున పర్యాటక ప్రాంతాలకు తరలి రావడం ఆనవాయితీ. అయితే, ఈసారి సండే లాక్ డౌన్ రూపంలో కానుం పొంగల్ కళ తప్పింది.
శతాబ్దాలుగా..
జల్లికట్టుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో తమకు నచ్చిన వారిని వరుడుగా ఎంపిక చేసుకునేందుకు ఈ క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి సంప్రదాయ బద్ధంగా సాగుతూ వస్తున్న ఈ క్రీడ మంజు విరాట్, వడి మంజు విరాట్, వెల్లి విరాట్, వడం విరాట్ పేర్లతోనూ పిలుస్తుంటారు. సల్లి కాసు–కట్టు, సల్టికాసు కట్టుగా, సల్లికట్టుగా.. చివరకు జల్లికట్టుగా రూపాంతరం చెందింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు ఆరంభం అయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలల పాటుగా వివిధ జిల్లాల వారీగా జరిగేది. ఒక్కో జిల్లాల్లో ఈ క్రీడ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులూ ఉన్నారు. వీరిలో తమ వీరత్వాన్ని చాటుకునేందుకు కదన రంగంలోకి దుకే వారు కొందరైతే, ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు దూసుకొచ్చే వారు మరికొందరు. అయితే ఈ క్రమంలో ఎద్దులను హింసించడం బాగా పెరిగిందనే కారణంతో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే తమ సాహస క్రీడను మహోద్యమంతో 2017లో మళ్లీ తమిళులు సాధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment