మోగిన నగారా
సాక్షి, బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)కు ఎన్నికలు నిర్వహించడానికి ముహూర్తం కుదిరింది. జులై 28న ఒకే దశలో బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఓట్ల లెక్కింపు సైతం అదే నెల 31న జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ శ్రీనివాసాచార్ గురువారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
- బీబీఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ జులై 8న అధికారికంగా వెలువడనుంది. ఇక ఆ రోజు నుంచి 15 వరకూ నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. 16న నామినేషన్ల పరిశీల న ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణకు 20 వరకూ అవకాశం ఉంది.
- బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును రూ.5 లక్షలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ విషయమై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వడానికి వీలుగా వివిధ హోదాల్లో మొత్తం 98 మంది అధికారులను నియమించనున్నారు.
- జులై 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అవసరమైన చోట్ల 30న రీ పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఓట్ల లెక్కింపును జులై 31న చేపట్టనున్నారు. మొత్తంగా ఆగస్టు 1లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేయనుంది. ఇక గురువారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఆగస్టు 1 వరకూ కొనసాగనుంది.
- బీబీఎంపీ పరిధిలో మొత్తం 198 వార్డులు ఉండగా అందులో 71,22,165 ఓటర్లు (ఈనెల 15 వరకూ) ఉన్నారు. అందులో పురుషులు 37,38,808, మహిళలు 33,82,231 మహిళలు కాగా 1,126 ఇతరులు.
- ఈసారి బీబీఎంపీ ఎన్నికల కోసం మొత్తం 6,733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయనుంది. అంత కంటే ఎక్కువ మంది ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఆక్సిలరీ పోలింగ్ బూత్‌లను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయనుంది.
- ఈ సారి ఓటింగ్ కోసం మొత్తం 11,635 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగించనున్నారు.
- నామినేషన్ వేయడానికి చివరి రోజు(జులై 15) వరకూ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి అనుమానాలు ఉంటే 080-22374740, 080-22224748, 080-22221188 నెంబర్లలో సంప్రదించవచ్చు.