ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద ఉధృతి
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు..
నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 54.34 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 48.5 మీటర్లగా ఉంది. నీటి నిల్వ 24.4 టీఎంసీలు ఉండగా ఇన్ఫ్లో 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు జిల్లాలో కేతపల్లి మూసీ కుడికాల్వకు గండి పడింది. కొత్తపల్లి గ్రామశివారులో నీరు వృథాగా పోతుంది. ఖమ్మంజిల్లాల్లో తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.