
ఇటుకలు దొరకడం లేదు...!
రాజధానిలో ఫ్లైయాష్ ఇటుకలనే వాడాలి
డిమాండ్‌కు సరిపడా లేని ఫ్లైయాష్ సరఫరా
రోజుకు 2,000 టన్నుల డిమాండ్
సరఫరా 600 టన్నులకే పరిమితం
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి ఇటుకల కొరత సమస్యగా మారింది. రాజధాని చుట్టుపక్కల నిర్మాణ రంగ పనులకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉండటం లేదు. తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పరిపాలన మొదలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు. అయితే వీటన్నింటికీ కావాల్సిన ఇటుకల సరఫరా కష్టంగా కనిపిస్తోంది. చట్ట ప్రకారం థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్న 100 కి.మీ పరిధిలో నిర్మాణ రంగంలో కేవలం ఫ్లైయాష్ ఇటుకలనే వాడాల్సి ఉంది. మట్టితో చేసిన ఇటుకలను వాడటానికి వీలు లేదు. రాజధాని ప్రాంతం విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(వీటీపీఎస్)కు కేవలం 10 కి.మీల దూరంలో ఉంది. దీంతో ఇక్కడ ఫ్లైయాష్ ఇటుకలనే వాడాల్సి ఉంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఫ్లైయాష్ ఇటుకల సరఫరా కావడం లేదు.
ఫ్లైయాష్ సరఫరా లేదు...
ఇటుకలు తయారు చేయడానికి తగినంత ఫ్లైయాష్‌ను విద్యుత్ కేంద్రాలు సరఫరా చేయడం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఫ్లైయాష్ బ్రిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 300 పైగా ఫ్లైయాష్ బ్రిక్స్ యూనిట్లున్నాయని, వీటికి రోజుకు 2,000 టన్నుల ఫ్లైయాష్ అవసరమైతే కేవలం 500 నుంచి 600 టన్నులు మాత్రమే సరఫరా ఉంటోందని ఏపీ ఫ్లైయాష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె.వి.సుబ్బారావు వివరించారు.
విజయవాడ వీటీపీఎస్ నుంచి రోజుకు సుమారు 8వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోందని, ఇందులో సిమెంట్ ఫ్యాక్టరీలకు 3వేల టన్నులు పోగా మిగిలిన ఫ్లైయాష్‌ను బ్రిక్స్ యూనిట్లకు ఇవ్వడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. థర్మల్‌పవర్ స్టేషన్లకు ఫ్లైయాష్‌ను వదిలించుకోవడం అతిపెద్ద సమస్య. అందుకే ఫ్లైయాష్‌ను బ్రిక్ యూనిట్లకు ఉచితంగా సరఫరా చేయడమే కాకుండా, తీసుకెళ్లినందుకు రవాణా ఖర్చులూ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చాలా థర్మల్ యూనిట్లు ఉచితంగా కొంత ఇచ్చినట్లు రికార్డుల్లో చూపి, మిగిలిన మొత్తాన్ని ఫ్లైయాష్ పాండ్స్‌లోకి తరలిస్తున్నాయి. ఇందుకోసం పెద్దఎత్తున మంచి నీటిని వృథా చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా ఫ్లైయాష్ యూనిట్లున్నాయి. వీటికి సగటున రోజుకు 20వేల టన్నుల ఫ్లైయాష్ అవసరమవుతుంది. కానీ ఈ స్థాయిలో ఫ్లైయాష్ సరఫరా లేదని బ్రిక్స్ యాజమాన్యం వాపోతోంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రత్యామ్నాయంగా మట్టి ఇటుకలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందువల్ల సారవంతమైన మట్టి వృథా కావడమే కాకుండా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించాలని ప్లైయాష్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది.