నీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి
►మూడు రోజుల్లో నివేదికలు అందించాలి
► అధికారులకు సీఎం ఆదేశాలు
►కరువు నివారణకు కేంద్రాన్ని రూ.1416 కోట్లు అడుగుతాం
►చిక్కబళ్లాపురం జిల్లా పర్యటనలో సీఎం సిద్ధరామయ్య
► కరువు సమయంలో రాజకీయం వద్దు విపక్షాలకు హితవు
చిక్కబళ్లాపురం: కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై కలెక్టర్లు దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. గురువారం ఆయన చిక్కబళ్లాపురం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. తొలుత కొళవనహళ్లిని సందర్శించిన సీఎం... స్థానిక రైతులతో మాట్లాడారు. పంటనష్టం, నీటి ఎద్దడి, కరువు సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి నివారణకు ఏర్పాటు చేసిన బోర్లను పరిశీలించారు. తర్వాత రెడ్డి గొల్లవారహళ్లి గ్రామంలో పర్యటించి కరువుపై ఆరా తీశారు. తర్వాత చిత్రావతి డ్యాంను సందర్శించినారు.
అనంతరం గౌరిబిదనూరు కల్లూడి గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను ఆలకించారు. తర్వాత జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయత్ సర్‌వీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. చిక్కబళ్లాపురం జిల్లాలోని అన్ని తాలూకాల్లో తాగునీటి కోసం బోర్లు వేశారని, యాక్షన్ ప్లాన్ ఆమోదం పొందలేదనే నెపంతో జిల్లా పాలక మండలి మోటార్లు సరఫరా చేయలేదని కొందరు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం స్పందించి కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా కలెక్టర్లు నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను సందర్శించి మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఎత్తిన హొళె పథకం రెండు జిల్లాలకు వరమని, ఇప్పటికే ఈ పథకానికి రూ.3700 కోట్లు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు.
బెంగళూరులోని మురుగ నీటిని శుద్ధి చేసి జిల్లాలోని 39 చెరువులకు నింపే పనులు వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు నివారణకు రూ. 1416 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈనెల 7న ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి కరువు పరిస్థితిని వివరిస్తామన్నారు. కరువు సమయంలో రాజకీయం చేయరాదని విపక్షాలకు హితవు పలికారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న యూకలిప్టస్ చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సమాచార శాఖా మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యేలు సుధాకర్, శివశంకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, రాజణ్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.