ఆయన కూడా అన్నారు
- రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారం కారణమన్న శరద్ పవార్ మాటలను ఉటంకించిన ఖడ్సే
- 2013లో పార్లమెంటులో మూడు సార్లు చెప్పారని వెల్లడి
- ఖడ్సే వ్యాఖ్యలపై సభలో గందరగోళం సృష్టించిన ఎన్సీపీ
- రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్.. సభ 20 నిమిషాలు వాయిదా
ముంబై: అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడివేడిగా సాగాయి. రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమని 2013లోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారని బీజేపీ నేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అన్నారు. లోక్ సభలో ఫిబ్రవరి 26, ఆగస్టు 6న, రాజ్యసభలో ఆగస్టు 16న పవార్ మూడు సార్లు ఈ వ్యాఖ్యలు చేశారని ఖడ్సే అసెంబ్లీలో చెప్పారు. దీంతో సభలో గందరగోళం ఎన్సీపీ సృష్టించింది. ఖడ్సే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఎన్సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో స్పీకర్ హరిభావ్ బాడ్గే సభను ఇరవై నిమిషాలు వాయిదా వేశారు.
రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై జాతీయ నేర పరిశోధన సంస్థ అందించిన వివరాల మేరకు అనారోగ్యం, మాదక ద్రవ్యాలకు బానిస అవడం, కుటుంబ సమస్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారాలు, పేదరికం, వృత్తి సమస్యలు, నపుంసకత్వం, వరకట్న సమస్యలు తదితర ఇతర అంశాలు కారణమని పవార్ చెప్పారని ఖడ్సే పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేసే సమయంలో సింగ్ గణాంకాలకు సంబంధించిన ఎన్‌సీఆర్‌బీ పత్రాలు చూపించారు. కాగా, స్పీకర్ అనుమతి లేకుండానే పవార్ పార ్లమెంటు వ్యాఖ్యలకు సంబంధించిన పత్రాన్ని పంచారంటూ ఎన్సీపీ నేత జైదత్ శిర్‌సాగర్ అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జైదత్ వ్యాఖ్యలను పృథ్విరాజ్ చవాన్ సమర్థించారు. అయితే దీనిపై ఖడ్సే స్పందిస్తూ.. తాను స్పీకర్ అనుమతి తీసుకున్నానని అయితే సంబంధిత పత్రం ఎలా పంపిణీ అయిందో విచారించాలన్నారు. ఖడ్సే స్పీకర్ అనుమతి తీసుకోలేదని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఎన్సీపీ నేతలు ఛగన్ భుజబల్, శశికాంత్ షిండే డిమాండ్ చేశారు. కరువుతో రైతులు తల్లడిల్లుతున్న సమయంలో పవార్ రూ. 76,000 కోట్ల మేర రుణాన్ని మాఫీ చేశారని భుజబల్ గుర్తు చేశారు. సింగ్ రూ. 76 కూడా మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు.
పరిశ్రమలకు గమ్యస్థానం మహారాష్ట్ర
ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర పరిశ్రమల విధానంపై ఆ శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు మహారాష్ట్ర గమ్యస్థానమన్నారు. ఆటోమోబైల్ సంస్థ జనరల్ మోటార్స్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం, పొరుగు రాష్ట్రం గుజరాత్‌లో కంపెనీ మూసేస్తున్నట్లు తెలపడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో పెట్టుబడి విధానాన్ని జనరల్ మోటార్స్ ప్రకటించిందని చెప్పారు. పుణేలోని తాలేగావ్‌లో ఉన్న కంపెనీని విస్తరించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు.
పాక్‌తో ద్వైపాక్షి చర్చలు వద్దు: అజిత్ పవార్ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరపకూడదని, క్రికెట్‌కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో టైస్టుల దాడిని ఖండిస్తూ అసెంబ్లీలో గురువారం అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శాసనసభ్యులపై వాట్సాప్‌లో పోస్ట్ చేస్తున్న ద్వేశపూరిత వార్తలను, తన సెల్‌ఫోన్‌లోని పోస్టులను కూడా అసెంబ్లీలో ఇతర సభ్యులకు పవార్ చూపించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పీకర్ హరిభావ్ బాగ్డేను కోరారు.
పేదల కడుపుకొట్టే సంస్కృతి కాదు నాది: పంకజ
‘చిక్కి’ల కుంభకోణం అంశంపై అసెంబ్లీ రభస జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే చిక్కి కుంభకోణం విషయంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాణ్యత లేని చిక్కీలను పంపిణీ చేశారని, పంకజ ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పంకజ ముండే ఆరోపణలు తిప్పకొట్టారు. పేదల కడుపుకొట్టే సంస్కృతి తనది కాదన్నారు. చిక్కిని కొనుగోలు నిర్ణయాన్ని కళ్లు మూసుకుని తీసుకోలేదని, అన్ని విభాగాలతోపాటు అనేక మందితో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యర్థులు ఆరోపణలతో గందరగోళం సృష్టించిన అనంతరం సీఎం కూడా తనదైన శైలిలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆరోపణలు చేసేవారికి వాటికి సమాధానాలు వినేంత ఓర్పు ఉండాలని చురకలంటించారు.
రాష్ట్రంలో జనరల్ మోటార్స్ రూ. 6,400 కోట్ల పెట్టుబడి
ఆటోమోబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) పుణేలో ఉన్న కంపెనీని విస్తరించేందుకు నిర్ణయించిందని, ఇందుకుగాను రూ. 6,400 కోట్లు పెట్టుబడి పెట్టనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. రెండేళ్లలో కంపెనీలో ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. గురువారం మధ్యాహ్నం జనరల్ మోటార్స్ అధికారులతో సీఎం ఫడ్నవీస్ సమావేశమయ్యారు. యూఎస్‌కు చెందిన మరో ఆటోమోబైల్ సంస్థ క్రిస్లర్ కూడా రాష్ట్రంలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జీఎం కంపెనీ 10 కొత్త చెర్వొలెట్ మోడళ్లను ఉత్పత్తి చేయనుందని వెల్లడించారు. గుజరాత్‌లోని కంపెనీని మూసెస్తున్నట్లు ప్రకటించిందని జీఎం తెలిపింది.