ఆ పాపం గత పాలకులదే
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటలకుపైగా గవర్నర్‌తో చర్చలు జరిపారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో వరుస రైతు ఆత్మహత్యలపై మంత్రివర్గ సమావేశంలో విచారం వ్యక్తం చేసిన సీఎం.. గవర్నర్‌కు అదే విషయాన్ని నివేదించారు.
హైదరాబాద్ కేంద్రంగా ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి దారి తీసిన కారణాలు తెలుసుకునేందుకు గవర్నర్ ఆసక్తి ప్రదర్శించినట్టు తెలిసింది. వర్షాభావ పరిస్థితులతోపాటు గతంలో పాలకు లు అనుసరించిన విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.6 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం.. గవర్నర్‌కు వివరించారు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీఈ నెల 18 వరకు రాష్ట్రంలో 242 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ధారించింది. వీరిలో 176 మందికి పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. ఈ వివరాలతో కూడిన నివేదికను గవర్నర్‌కు సీఎం అందజేసినట్లు తెలిసింది. ఈనెల 20 నుంచి చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. గతంతో పోలిస్తే ఈ మొత్తం నాలుగు రెట్లు పెంచినట్లు తెలిపారు.
దీంతోపాటు ఇటీవల చైనా పర్యటన వివరాలను గవర్నర్‌తో సీఎం పంచుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో పెట్టుబడులకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి ప్రదర్శించారని, హైదరాబాద్‌లో కొత్త పరిశ్రమల స్థాపనకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
బుధవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, గణేష్ ఉత్సవాలు, బక్రీద్‌ల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన బందోబస్తు చర్యలు, పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించిన విషయాలను చర్చించారు. ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్‌కౌంటర్, పలు నామినేటేడ్ పోస్టుల నియామకం అంశాలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, బీసీ, మైనారిటీ కమిషన్ల పదవుల నియామకంతోపాటు ఆర్టీఐ, మానవ హక్కుల కమిషన్ల పదవుల నియామకంపై చర్చించినట్లు తెలిసింది.