చెక్ బౌన్స్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఇరా అన్భరసుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ
సాక్షి, చెన్నై :చెక్ బౌన్స్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఇరా అన్భరసుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ జార్జ్ టౌన్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. చెన్నైకు చెందిన ఫైనాన్సియర్ ముకుల్ సన్ గోత్రా 2007లో జార్జ్ టౌన్ కోర్టులో చెక్ బౌన్ కేసుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్ గాంధి ట్రస్ట్ నిర్వాహకులు, మాజీ ఎంపి ఇరా అన్భరసు, ఆయన భార్య కమల, ఓ థియేటర్ ప్రతినిధి మణిలు తన వద్ద రూ. 35 లక్షలు తీసుకున్నారని వివరించారు. తనకు చెక్ ఇచ్చారని, అయితే, అది బౌన్స్ అయిందని పేర్కొన్నారు.
తనకు ఇవ్వాల్సిన మొత్తం కోసం పలు మార్లు వారి చుట్టు తిరిగినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను గత ఏడేళ్లుగా జార్జ్ టౌన్ ఎనిమిదో మేజిస్ట్రేట్ కోర్టు విచారిస్తూ వచ్చింది. విచారణ ముగియడంతో న్యాయమూర్తి కోదండ రాజ్ గురువారం తీర్పు వెలువరించారు. అన్భరసు , ఆయన భార్య కమల, మణిలపై చెక్ బౌన్స్ కేసు నిరూపితం కావడంతో తలా రెండేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే, రూ. 35 లక్షలకు గాను 2006 నుంచి ఏడాదికి తొమ్మిది శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించారు.