లోక్‌సభ బరిలో మాజీ డీజీపీ?
Published Thu, Apr 3 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
ఒకప్పుడు ఆయన సీనియర్ పోలీస్ బాస్... ఆ తర్వాత తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్...ఇప్పుడు అన్నాడీఎంకేలో నాయకుడు... ఆయనే మాజీ డీజీపీ ఆర్ నటరాజ్. పదవీ విరమణానంతరం మౌనంగా ఉన్న ఆయన హఠాత్తుగా అన్నాడీఎంకే కండువా వేసుకున్నారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత ఆశీస్సులతో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆయన్ను లోక్‌సభ బరిలో దించే వ్యూహంతో జయలలిత ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంటోంది.
సాక్షి, చెన్నై: ‘ఆర్ నటరాజ్’ అంటే, తమిళనాట ఎవరైనా సరే గుర్తు పడుతారు. ఎందుకంటే, బుర్ర మీసాల పోలీసు అధికారి గనుక. తిరునల్వేలికి చెందిన నటరాజ్ 1975 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తన సేవలను పూర్తి కాలం తమిళనాడుకు అందించారు. అన్నాడీఎంకేకు విధేయుడిగా ముద్ర పడిన ఆయన రెండు సార్లు చెన్నై పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. 2006లో అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి సైతం గురయ్యారు. ఏడీజీపీగా, డీజీపీగా పదోన్నతులు పొందిన ఆయన ఏకంగా డీఎంకే సర్కారుపై పెద్ద సమరమే చేశారు. తనకు దక్కాల్సిన శాంతి భద్రతల విభాగం డీజీపీ పదవిని, జూనియర్‌గా ఉన్న లతికా చరణ్‌కు అప్పగించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కోర్టులో పోరాడారు. అంతలోపు పదవీ విరమణ పొందాల్సి వచ్చింది.
అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ఆయన్ను నియమించింది. చతికిలబడి ఉన్న ఆ విభాగానికి పునరుత్తేజాన్ని ఆయన కల్పించారు. ఆ పదవీ కాలం గత ఏడాది ముగిసింది. విశ్రాంతిలో ఉన్న ఆయన ఉన్నట్టుండి మంగళవారం సీఎం జయలలితను కలుసుకుని, అన్నాడీఎంకేలో చేరారు. అన్నాడీఎంకేకు తన సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. అయితే, ఇన్నాళ్లు మౌనంగా ఉండి, హఠాత్తుగా నటరాజ్ పార్టీలో చేరడం వెనుక ఆంతర్యం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన్న ఎన్నికల బరిలో దించడం లక్ష్యంగా జయలలిత సమక్షంలో ఆగమేఘాలపై పార్టీలో సభ్యుడిగా చేర్పించాల్సి వచ్చిందన్న ప్రచారం ఊపందుకుంటోంది. నటరాజ్‌బాటలో మరి కొందరు మాజీ ఐపీఎస్‌లు అన్నాడీఎంకేలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఎన్నికల బరిలో దిగేనా?: చెన్నై జిల్లా పరిధిలోని మూడు లోక్ సభ సెగ్మంట్లలో ఒక దాంట్లో అభ్యర్థి ప్రచారం అసంతృప్తిగా ఉన్నట్టు, ఆ అభ్యర్థి ఓటర్లను ఆకర్షించే రీతిలో లేనట్టుగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం జయలలితకు చేరినట్టు సమాచారం. ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా బలమైన వ్యక్తి ఉండటంతో, ఆయన్ను ఢీ కొట్టేందుకు తమ అభ్యర్థి సరి తూగే పరిస్థితుల్లో లేనట్టు తేలింది. ఈ దృష్ట్యా, బలమైన అభ్యర్థిగా, ఉన్నతాధికారి హోదాలో పనిచేసి పదవీ విరమణ పొందిన నటరాజ్‌ను ఆ స్థానంలో దించే వ్యూహంలో జయలలిత ఉన్నట్టు తెలిసింది. నటరాజ్ మాత్రం ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూల్లో పోటీకి రెడీ అన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం.
పోటీకి రెడీ: అన్నాడీఎంకేలో చేరిక గురించి ఓ మీడియా నటరాజ్‌ను ప్రశ్నించింది. హఠాత్తుగా రాజకీయాల్లోకి రావడం వెనుక కారణాల గురించి ప్రశ్నించగా, చిన్న నాటి నుంచి తనకు రాజకీయాలంటే చాలా ఇష్టం అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ అధికారిగా ప్రజా సేవ చేశానని, ఇప్పుడు బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాల ద్వారా పూర్తి స్థాయిలో సేవకు సిద్ధం అయ్యానన్నారు. అన్నాడీఎంకేలో చేరడం వెనుక ఆంతర్యం గురించి ప్రశ్నించగా, తనకు అన్నాడీఎంకే అంటే చాలా ఇష్టం అని, సీఎం, పార్టీ అధినేత్రి జయలలిత ధైర్యం, నిక్కచ్చితనం, ఆమె తీసుకున్న నిర్ణయాలను ఎల్లప్పుడు తాను ఆహ్వానిస్తూనే ఉంటానన్నారు. సునామీ సమయంలో ఆమె సీఎంగా ఉన్నప్పుడు, వెన్నంటి ఉండి పనిచేశానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అని ప్రశ్నించగా, పోటీ చేయమని సీఎం జయలలిత ఆదేశించిన పక్షంలో తాను రెడీ అని, పార్టీ ఆదేశాల్సి శిరస్సా వహిస్తానని పేర్కొనడం గమనించాల్సిందే. అయితే, అన్నాడీఎంకే అభ్యర్థులందరూ నామినేషన్లు సమర్పించిన దృష్ట్యా, మార్పు జరిగేనా అన్నది అనుమానమే. చివరి క్షణంలో అభ్యర్థుల్ని మార్చిన సందర్భాలు జయలలితకు పరిపాటే గనుక, జరిగినా జరగొచ్చేమో.!
Advertisement
Advertisement