రాణే.. పరిస్థితి...
తన పరిస్థితి ఏంటో తనకే తెలియని దుస్థితి మాజీ మంత్రి నారాయణ్ రాణేకు దాపురించింది. లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకు ఘోర పరాభవంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన అడుగులు బీజేపీవైపు పడుతున్నట్లు కనిపిం చాయి. అందుకు ముండే మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ముండే మరణంతో రాణే పరిస్థితి అగమ్యగోచరంగా త యారైంది.
బీజేపీ సీనియర్ నాయకుడు గోపినాథ్ ముండే అకాల మరణంతో కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే పరిస్థితి ముందు అగమ్యగోచరంగా తయారైంది. తాను బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు ముండే లేకపోవడంతో దాదాపుగా ఆవిరైపోయాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొడుకు నితేష్ రాణే దారుణంగా ఓడిపోవడంతో నారాయణ్ రాణే తీవ్ర ఆందోళనలో పడిపోయారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు నితేష్ ఓడిపోతే తన పదవికి రాజీనామ చేస్తానని ఎన్నికలకు ముందు రాణే బహిరంగంగా సవాల్ చేశారు. నితేష్ ఓడిపోవడంతో అన్నట్లుగా పదవికి రాజీనామ చేసిన రాణే కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు.
రాణే కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయం వెనుక బీజేపీలో చేరాలనే అభిప్రాయం దాగుందనే కథనాలు అప్పట్లో మీడియాలో ప్రసారమయ్యాయి. ఇందుకోసం గోపీనాథ్ ముండేతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే గోపీనాథ్ ముండే నుంచి రాణేకు ఎటువంటి హామీ లభించకపోయినా త్వరలో బీజేపీలో చేర్చుకునే విషయమై పార్టీ సీనియర్లతో మాట్లాడతాననే హామీ ముండే నుంచి లభించినట్లు రాణే సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు గోపీనాథ్ ముండే మరణించడంతో తనను బీజేపీ నావలోకి చేర్చే నాథుడెవరని రాణే ఆందోళనలో పడిపోయినట్లు చెప్పుకుంటున్నారు.
ఇటు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రచారం జరగడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని, అటు బీజేపీలో చోటు దక్కకపోవడం, దక్కే అవకాశాలు గోపీనాథ్ ముండే మరణంతో ఆవిరికావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాణే పడిపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
శివసేన అడ్డుపడే అవ కాశం...
ఒకవేళ రాణేను బీజేపీలో చేర్చుకుంటే శివసేనతో బీజేపీకి ఉన్న తత్సంబంధాలు దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముండే లేకపోయినా మరెవరితోనైనా బీజేపీ సీనియర్ నేతలను రాణే కలిసే ప్రయత్నం చేసినా అందుకు శివసేన అడ్డుపడే అవకాశముందంటున్నారు. ఒకవేళ గోపీనాథ్ ముండే బతికుంటే శివసేనను ఒప్పించే అవకాశముండేదని, ఇప్పుడు అంతటి స్థాయి ఉన్న నాయకుడు రాష్ట్రంలో బీజేపీకి ఎవరూ లేరని చెబుతున్నారు.
సర్దుకుపోదామనే ధోరణిలో రాణే..
బీజేపీలో చేరేందుకు ఉన్న ఒక్క దారీ మూసుకుపోవడంతో రాణే ఇక కాంగ్రెస్‌లోనే సెటిలైపోదామనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు తనకు ప్రాధాన్యమివ్వకున్నా కొన్నిరోజులు సర్దుకుపోదామనే ధోరణిలో ఆయన కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకేనా?
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను తొలగిస్తారనే వార్తలు వెలువడిన వెంటనే రాణే ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న హామీతోనే రాణే కాంగ్రెస్‌లోకి వచ్చినా ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో కనీసం ఇప్పుడైనా సీఎం పోస్టు తనకు ఇవ్వాలని సోనియాను కోరాలనుకున్నారు. అయితే సోనియాగాంధీ రాణేకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండానే తిప్పిపంపడంతో ఆయన ముండేతో సమావేశమయ్యారనే ప్రచారం జరిగింది.