సాక్షి, ముంబై: పేద ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని సార్వజనిక ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా 429 రకాల మందులు, మాత్రలను పూర్తి ఉచితంగా అందిస్తారు. వైద్యం, ఆపరేషన్లు, ఇతర పరీక్షల కోసం అవసరమయ్యే పరికరాలు, సామగ్రి అన్ని స్థానిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. ఈ బృహత్తర పథకాన్ని ఈ నెల 20 నుంచి అమలుచేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సురేశ్ శెట్టి వెల్లడించారు.
సాధారణంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నింటికి మినహా ఇతర వ్యాధుల చికిత్స, ఆపరేషన్లకు, కొన్ని పరీక్షలకు కొంతమేర రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో పేదలపై అదనంగా ఆర్థికభారం పడుతోంది. త్వరలోపేదలకు వీటి నుంచి విముక్తి లభించనుంది. ఈ నెల 20 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా, ఉపజిల్లా, మహిళ, గ్రామీణ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు, మందులు లభించనున్నాయి. ఇలా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మొదటిరాష్ట్రంగా మహారాష్ట్రకు స్థానం లభించనుంది. ఇక నుంచి అన్ని రకాల మందులు, ఇంజక్షన్లు, దూది, బ్యాండేజీలను ఉచితంగానే ఇస్తారు. ఇదిలా ఉండగా కేన్సర్లనూ ఉచిత వైద్యసేవల జాబితాలో చేర్చారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులను దీనికి వినియోగిస్తామని సురేశ్ శెట్టి పేర్కొన్నారు. 1,811 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10,580 ఆరోగ్య ఉపకేంద్రాలు, 360 గ్రామీణ ఆస్పత్రులు, 13 సంచార అస్పత్రులు, 86 ఉపజిల్లా ఆస్పత్రులు, 23 జిల్లా ఆస్పత్రులు, 11 మహిళా ఆస్పత్రులు, ఏడు కుటుంబ సంక్షేమ ఆస్పత్రులు, నాలుగు కేన్సర్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు లభించనున్నాయి.
అన్ని వ్యాధులకూ ఉచితవైద్యం
Published Thu, Jan 2 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement