రెండు వర్గాల మధ్య చిచ్చు
Published Mon, Jan 27 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
సాక్షి, చెన్నై:నగరంలో రెండు వర్గాల మధ్య ఆదివారం చిచ్చు రేగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పాత చాకలి పేట పాండియన్ థియేటర్ వీధిలో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ మరో సామాజిక వర్గం తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. దేశ సామరస్యాన్ని చాటే రీతిలో రిపబ్లిక్ డే వేడుకలు ఓ వైపు కోలాహలంగా జరుగుతున్న సమయంలో ఒక వర్గం కార్యాలయ ప్రారంభోత్సవానికి దిగడం వివాదానికి దారి తీసింది. వివాదం: అట్టహాసంగా తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆ ప్రాంతంలోని మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ వివాదంలోనే తమ కార్యాలయాన్ని ప్రారంభించిన నాయకుడు అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. బ్యానర్లను చించేయడంతో వివాదం చిలికి చిలికి గాలి వానంగా మారింది. ఇరు వర్గాలు కయ్యానికి కాలు దువ్వు కోవడంతో పాండియన్ థియేటర్‌రోడ్డు యుద్ధరంగాన్ని తలపించింది. ఎక్కడికక్కడ దుకాణాలు మూత బడ్డాయి.
రంగంలోకి బలగాలు
సమాచారం అందుకున్న పోలీసు బలగాలు హుటాహటిన రంగంలోకి దిగాయి. వివాదం తీవ్ర రూపం దాల్చకుండా పరిస్థితిని కట్టడి చేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. కనిపించిన వాళ్లందరినీ చెదరగొట్టారు. మళ్లీ వివాదం తీవ్ర రూపం దాల్చకుండా అక్కడే బలగాలు తిష్ట వేశాయి. అదే సమయంలో ఇక్కడి వివాద దృశ్యాల్ని కవర్ చేయడం కోసం మీడియా ఉరకలు తీసింది. మీడియా రావడంతో ఓవర్గం యువకులు మరింతగా రెచ్చి పోయారు. మీడియా పదే పదే తమ మీద నిందల్ని వేస్తున్నదంటూ తిరగ బడ్డారు. ఓ టీవీ ఛానల్ కెమెరామన్‌పై దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. ఇద్దరు ఫోటోగ్రాఫర్లపై దాడికి దిగారు. ఈతంతు అక్కడ కళ్ల ముందు సాగుతున్నా, పోలీసులు చోద్యం చూడటం కొసమెరుపు.
Advertisement
Advertisement