అన్నాడీఎంకేలో ఎమ్మెల్యే సీటు పొందేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ నేత ఒకరు మంత్రి సమక్షంలోనే బాహాబాహీ తలపడ్డారు.
సేలం అన్నాడీఎంకేలో డిష్యుం..డిష్యుం
టీనగర్: అన్నాడీఎంకేలో ఎమ్మెల్యే సీటు పొందేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ నేత ఒకరు మంత్రి సమక్షంలోనే బాహాబాహీ తలపడ్డారు. ఇందులో ఎమ్మెల్యే చొక్కా చిరిగింది. సేలంలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నాడీఎంకే నేతలు పలువురు దరఖాస్తులు చేస్తున్నారు. సేలం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా పార్టీ నేతలలో తీవ్ర పోటీ నెలకొంది.
ఇందులో తన మద్దతుదారుల్లోనే రెండు వర్గాలుగా కార్యకర్తలను విడదీసి చోద్యం చూస్తున్నట్లు మంత్రిపై పార్టీ వర్గాలలోనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సదరు నేత మళ్లీ పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. అదేవిధంగా అదే నియోజక వర్గం మంత్రి మద్దతుతో సబర్బన్ ప్రాంతానికి చెందిన సహకార సంఘం నిర్వాహకుడు ఒకరు బరిలోకి దిగారు. ఆయన కూడా ప్రస్తుతం సీటు కోరుతూ నగదు చెల్లించారు. మంత్రి మద్దతు సహకార ప్రముఖుడికి ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో దిగ్భ్రాంతి చెందిన నగర ప్రముఖుడు గత కొన్ని రోజుల క్రితం మంత్రిని కలిసేందుకు వెళ్లాడు.
ఆ సమయంలో అక్కడ సహకార ప్రముఖుడు ఉన్నారు. వీరి మధ్య ఏర్పడిన వాగ్వాదం హఠాత్తుగా ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురూ బాహాబాహీ తలపడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగింది. వేరొక గదిలో ఉన్న మంత్రి దీన్ని గమనించి ఇద్దరినీ మందలించారు. తన చొక్కాను ఎమ్మెల్యేకు ఇచ్చి సహకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటికి పొక్కి ఏదైనా జరిగితే తాను ఇరువురినీ కాపాడలేనని సదరు మంత్రి తెలపడం అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది.