సాక్షి, ముంబై: పది రోజులపాటు భక్తుల నుంచి పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. అనంతచతుర్ధి రోజైన బుధవారం నాడు వినాయకుడిని సాగనంపడానికి సార్వజనిక మండళ్లుకూడా ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాయి. నిమజ్జనాలకు భారీగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలనా విభాగం సకల ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సముద్ర తీరాలతోపాటు కృత్రిమ చెరువులవద్ద సర్వం సిద్ధం చేసింది. బుధవారం మధ్యాహ్నం తరువాత నిమజ్జన ఉత్సవాలు, ఊరేగింపులు ప్రారంభమవుతాయి. ఇందులో లాల్‌బాగ్ చా రాజా, మరికొన్ని మండళ్ల విగ్రహాల ఊరేగింపు నెమ్మదిగా సాగుతుంది. విగ్రహాల నిమజ్జన కార్యక్రమం గురువారం తెల్లవారుజామున పూర్తవుతుంది. విగ్రహాలను తరలించే ట్రక్కులు, ట్రాలీలు, టెంపోలు ఏ మార్గం మీదుగా వెళ్లాలనే విషయమై సార్వజనిక మండళ్లకు మార్గదర్శనం చేసేందుకు అక్కడక్కడా సిబ్బందిని మోహరించింది.
ఇక సముద్ర తీరాలు, కృత్రిమ చెరువుల వద్ద విద్యుద్దీపాలు, ఫ్లడ్‌లైట్లు, సెర్చ్‌లైట్లు ఏర్పాటు చేసిం ది. నగరంలోని గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి, దాదర్ శివాజీపార్కు, మాహిం, జుహూ, మార్వే, వర్సోవా తదితర తీరాల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జన ఘాట్లను ఒక రోజుముందే బీఎంసీ మేయర్ సునీల్ ప్రభు, అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా తదితర అధికారులు పరిశీలించారు. సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. సముద్రతీరాల్లో వాహనాలు ఇసుకలో చిక్కుకుపోకుండా స్టీలు ప్లేట్లు వేశారు. 24 గంటలపాటు తాత్కాలిక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 240 మంది లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచారు. 41 స్టీమర్లు, వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ప్రథమ చికిత్స కేంద్రాలు, తాత్కాలిక మొబైల్ టాయిలెట్లు, ఫ్లడ్ లైట్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా తదితర ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇలా బీఎంసీ తనవంతుగా భక్తులకు ఏర్పాట్లు పూర్తిచేసింది.
భద్రతకు పెద్ద పీటవేసిన పోలీసు శాఖ
మరోవైపు నగరపోలీసు శాఖ కూడా తమవంతుగా ముంబైకర్ల భద్రతకు పెద్ద పీట వేసింది. కోటిన్నరకుపైగా ఉన్న నగర జనాభాపై దృష్టి సారించేందుకు నగర పోలీసు శాఖ వివిధ రంగాల భద్రతా దళాలను రంగంలోకి దింపింది. ఉత్సవాల సమయంలో శివారు ప్రాంతాల నుంచి కూడా భారీఎత్తున భక్తులు వస్తుంటారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా జనసంచారమే కనిపిస్తుంది. భక్తులకుభద్రత కల్పించేందుకు సర్వం సిద్ధం చే సినట్లు నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (శాంతి, భద్రతలు) సదానంద్ దాతేలు చెప్పారు. నిమజ్జన ఉత్సవాల్లో ప్రశాంతంగా ముగిసేవిధంగా చేసేందుకు అవసరమైన పోలీసు బలగాలను హోం శాఖ రంగంలోకి దిం పింది. ఉత్సవాల సమయంలో ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని సింగ్ సూచించారు. అత్యవసర సమయంలో 22633333 ప్రత్యేక నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.
భద్రతలో భాగంగా మొత్తం 25 వేల మంది పోలీసులు, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ కు చెందిన 18 బెటాలియన్లు, 450 బీట్ మార్షల్స్‌ను మోహరించామని పేర్కొన్నారు. వీరితోపాటు నగరం బయట నుంచి అదనంగా పోలీసు అధికారులు, 2,800 మంది సిబ్బంది, 2,500 మంది హోం గార్డులు, క్యూఆర్టీ, ఫోర్స్ వన్, ఏటీఎస్ అధికారులు, సివిల్ డిఫెన్స్‌కు చెందిన 500 మంది కార్యకర్తలు విధులు నిర్వహిస్తారు. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు 3,344 మంది ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉంచారు. అడుగడుగునా పోలీసులు అందుబాటులో ఉంటారు. వీరంతా కళ్లలో వత్తులేసుకుని విధులు నిర్వర్తిస్తారని, భక్తులు అందోళన చెందాల్సిన అవసరం లేదని సత్యపాల్ సింగ్, సదానంద్ దాతేలు భరోసా ఇచ్చారు.
పుణేలో పటిష్ట బందోబస్తు
పింప్రి, న్యూస్‌లైన్: భక్తులచే విశేషంగా పూజలందుకున్న గణనాధుల నిమజ్జనానికి పుణేలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మండాయిలోగల బాలగంగాధర్ తిలక్ విగ్రహం వద్ద పుణే నగర మేయరు చంచలా కోడ్రే, పుణే పోలీస్ కమిషనర్ గులాబ్‌రావ్ పోల్ హారతి ఇచ్చి నిమజ్జనానికి స్వాగతం పలుకనున్నారు. నిమజ్జన మార్గాల్లో అడుగడుగునా పోలీసుగస్తీని ఏర్పాటు చేశారు. సుమారు 14 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనుండగా, ఆరు వేల మంది ఎన్‌సీసీ విద్యార్థులు నిమజ్జనానికి సహాయ సహకారాలు అందించనున్నారు. వీరితోపాటు సామాజిక సంస్థల కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా చేయూత ఇవ్వనున్నారు. రాజకీయ వేత్తలు, పారిశ్రామిక ప్రముఖులు, సెలబ్రిటీలు విదేశీయులు అధిక సంఖ్యలో నిమజ్జనానికి తరలి రానుండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహనాలతోపాటు, మొబైల్ వైద్య శాలలు, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా తిలక్ మార్గం, లక్ష్మీ రోడ్డు, కేల్కర్ రోడ్డు, కుమఠేకర్ మార్గంమీదుగా సుమారు 500లకు పైగా సార్వజనిక గణేశ్‌మండళ్లు నిమజ్జనానికి వెళ్లనున్నాయి. ఈ మార్గాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
వీడ్కోలు వేళాయెరా
Published Tue, Sep 17 2013 11:49 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM
Advertisement