ఫస్ట్ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనమే..
► ఈ ఏడాది లడ్డూ ప్రసాద పంపిణీ ఉండదు
► సైఫాబాద్ ఏసీపీ వెల్లడి
ఖైరతాబాద్: ప్రతీ సంవత్సరం నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత చేసే ఖైరతాబాద్ గణనాథుని విగ్రహాన్ని ఈ ఏడాది అన్నిటికంటే ముందే నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్టు సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి తెలిపారు. 10 రోజుల పూజల అనంతరం ఆదే రోజు అర్ధరాత్రి నుంచి నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభించి 11వ రోజు మధ్యాహ్ననికల్లా నిమజ్జనం పూర్తిచేస్తామన్నారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాద పంపిణీ ఉండదని, గతేడాది లడ్డూ పంపిణీలో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వినాయకచవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ సూచించారు.
సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో బుధవారం సాయంత్రం మెహిందీ పంక్షన్‌హాల్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ... పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది 134 వినాయక విగ్రహాలను ఏర్పాటుచేశారని, ఈసారి కూడా ఈ సంఖ్యకు మించి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మండపాలను ఏర్పాటు చేసే స్థలాలు వివాదాస్పదమైనవి కాకుండా, రోడ్డుకు అడ్డంగా ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఎన్‌ఓసీ తీసుకోవాలని సూచించారు. బలవంతంగా చందాలు వసూలు చేయకూడదన్నారు.
ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాల ఎత్తు 20 అడుగులు మించకుండా చూసుకోవాలని సూచించారు. నగరంలో మెట్రో పనుల నేపథ్యంలో ఎల్తైన విగ్రహాలను తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయాన్ని గమనించాలన్నారు. మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఏసీపీ సురేందర్‌రెడ్డి సూచించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో పాటు సైఫాబాద్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.