
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు డిమాండ్
నల్లగొండ టూటౌన్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ లో శనివారం రెండవ రోజు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు కోర్టు కేసు చూపి కాలయాపన చేయడం సరికాదన్నారు. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని చెప్పారు.
రెగ్యులర్ లెక్చరర్లకు ఇస్తున్న వేతనాలను కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులు చేపడుతున్న సమ్మెకు తమ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. సమ్మెకు వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి యాదయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ ఫయాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి మద్దతు తెలిపారు.