► గిరిజా వైద్యనాథన్ బాధ్యతల స్వీకరణ
► తొలి రోజే బిజీబిజీ
► తంగంకు రూ. 2 కోట్లు
► చెన్నై ఓపెన్ కు మరో రూ. రెండు కోట్లు
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణతో శుక్రవారం తన విధుల్లో బిజీ అయ్యారు. సీఎం పన్నీరుసెల్వంతో కలసి సమీక్షల్లో, సచివాలయంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పన్నీరు సెల్వం చేతుల మీదుగా రియో పారాలింపిక్ హీరో తంగవేల్‌కు, చెన్నై ఓపెన్ కు ప్రభుత్వ వాటా గా తలా రూ.రెండు కోట్లు చొప్పున చెక్కులను అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా సచివాలయంకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు మచ్చ చేకూర్చే రీతిలో ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు అవినీతి బండారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు ఉద్వాసన పలికి ప్రధాన కార్యదర్శి స్థానాన్ని మహిళా అధికారి గిరిజా వైద్యనాథన్ ద్వారా భర్తీ చేస్తూ సీఎం పన్నీరుసెల్వం ప్రభుత్వం నిర్ణయించింది.
1981వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్ 1983లో తిరువళ్లూరు సబ్‌కలెక్టర్‌గా, 1992లో మధురై కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో అడుగు పెట్టి, ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో 45వ ప్రధాన కార్యదర్శిగా, మహిళా శక్తుల్లో నాలుగో అధికారిగా పగ్గాలు చేపట్టేందుకు శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన గిరిజా వైద్యనాథన్ కు సహచర అధికారులు సాదర స్వాగతం పలికారు. తన చాంబర్‌లో కొత్త సీఎస్‌గా పగ్గాలు చేపట్టినానంతరం సీఎం పన్నీరుసెల్వంను మర్యాద పూర్వకంగా గిరిజా వైద్యనాథన్ కలిశారు.
ఈసందర్భంగా పలువురు ఐఏఎస్‌లు, సచివాలయం వర్గాలు, కార్యదర్శులు కొత్త సీఎస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలను అందజేశారు. పగ్గాలు చేపట్టగానే, సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి ఉంటూ, పలు కార్యక్రమాల్లో గిరిజా వైద్యనాథన్ తొలి రోజే తన పదవికి న్యాయం చేకూర్చే విధంగా బిజీ అయ్యారు.
తంగంకు రూ.2 కోట్లు :
రియోలో జరిగిన పారాలింపిక్‌లో తమిళ తంగం మారియప్పన్ తంగవేలు బంగారు పతకం దక్కించుకున్న విషయం తెలిసిందే. తమిళ ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన తంగంను సత్కరించే విధంగా, ప్రోత్సహించే రీతిలో అమ్మ జయలలిత రూ. రెండు కోట్లు నగదు బహుమతిని ప్రకటించారు. రియో నుంచి చెన్నైకు తంగం వచ్చే సమయానికి అమ్మ జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, తదనంతర పరిణామాలతో ఆ నగదు బహుమతి వ్యవహారం తెర మరుగున పడిందని చెప్పవచ్చు. అయితే, అమ్మ జయలలిత చేసిన ప్రకటన మేరకు తంగంకు రూ. రెండు కోట్లు బహుమతిని అందించేందుకు సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. కొత్త సీఎస్ పగ్గాలు చేపట్టిన రోజే, తంగంకు ఆ బహుమతిని సచివాలయంలో అందజేశారు. తన కోచ్ సత్యనారాయణన్ తో కలిసి సచివాలయానికి వచ్చిన మారియప్పన్ తంగ వేలు రూ. రెండు కోట్లకుగాను చెక్కును సీఎం పన్నీరు సెల్వం చేతుల మీదుగా అందుకున్నారు.
చెన్నై ఓపెన్ కు రూ. రెండు కోట్లు :
ప్రతి ఏటా చెన్నైలో టెన్నిస్ పోటీలు సాగుతున్న విషయం తెలిసిందే. చెన్నై ఓపెన్ పేరుతో సాగుతున్న ఈ పోటీలకు అమ్మ జయలలిత తొలి నాళ్లలో రూ. కోటి నగదు కేటాయించారు. తదుపరి రూ. రెండు కోట్ల మేరకు నగదును అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది పోటీలకు రూ. రెండు కోట్లకుగాను చెక్కును సీఎం పన్నీరుసెల్వం అందించేందుకు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నై ఓపెన్ అధ్యక్షుడు అళగప్పన్ ఆ చెక్కును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో కొత్త సీఎస్ గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు. తదుపరి రాష్ట్రంలో పెట్టుబడులు లక్ష్యంగా ముందుకు వచ్చిన జపాన్ కు చెందిన ప్రతినిధుల బృందంతో జరిగిన సమీక్షలో సీఎం పన్నీరుసెల్వం, ఇతర మంత్రుల బృందంతో కలిసి కొత్త సీఎస్ బిజీ అయ్యారు.