బూట్లలో బంగారం బిస్కెట్లు
► రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం
► బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఒకరి అరెస్ట్
బెంగళూరు : ఎవరికీ అనుమానం రాకూడదని వేసుకున్న బూట్లలో బంగారాన్ని దాచాడు. కానీ అలా వేసుకున్న బూట్లతో సరిగ్గా నడవలేక దొరికిపోయాడు. మంగళవారం వీఎం ఫహాద్ (37) అనే ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి బెంగుళూరుకు వచ్చాడు. కెంపెగౌడ విమానాశ్రయంలో దర్జాగా దిగిన ఆ యువకుడు విమానాశ్రయంలో అటుఇటుగా నడుస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది.
అతడి నడక తీరులో తేడా కనిపించడంతో అనుమానంతో ఆ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. తేడాతో నడుస్తున్నందున ముందుగా అతడు వేసుకున్న బూట్లను విప్పించగా... ఆశ్చర్యం... దాచిన బంగారం బయటపడింది. అయితే ఆ ప్రయాణికుడు ఏకంగా 58 లక్షల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను బూట్లతో దాచి తరలిస్తున్నాడు.
తులాల్లో కాదు ఏకంగా రెండు కిలోల బంగారు బిస్కెట్లను బూట్లతో ఉంచినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో అధికారులు ఫహాద్ నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఫహాద్ గోవాకు చెందిన వ్యక్తి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడు తరలిస్తున్న బిస్కెట్ల ధర మార్కెట్ లో సుమారు 58.60 లక్షల రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.