గోల్డ్ మేన్ అలోక్ మహంతి
భువనేశ్వర్/కటక్: ఈ ఫొటోలో వ్యక్తి ధరించింది బంగారు మాస్కు. 3 తులాల బంగారంతో దీనిని తయారు చేయించుకున్నాడు. ఆయన కటక్ జిల్లాలోని కేశర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఫర్నిచర్ వ్యాపారి అలోక్ మహంతి. బంగారు ఆభరణాలంటే అలోక్ మహంతికి మక్కువ. ఆయన నిత్యం వినియోగించే ప్రతి హంగులో బంగారం ఎంతో కొంత ఉండాలనే కోరుకుంటాడు. గొలుసులు, ఉంగరాలు వంటి సాధారణ ఆభరణాలతో పాటు చేతి గడియారం, టోపీ వంటి నిత్య వినియోగ సామగ్రిలో ఏదో ఒక రీతిలో బంగారం హంగు అద్దుకుని నగరంలో గోల్డ్‌మేన్‌గా చలామణి అవుతున్నాడు.
ముంబైలోని జావేరి బజారులో పేరొందిన బంగారు ఆభరణాల డిజైన్‌తో ముచ్చట పడి స్థానిక కంసాలితో ఈ మాస్కు తయారుచేయించుకున్నాడు. ఇది తయారు చేసేందుకు 3 వారాలు వ్యవధి పట్టిందని వివరించాడు. బంగారం పట్ల మక్కువ ఎంతో మానవ సేవ పట్ల ఆసక్తి కూడా అంతే. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరంతరం ఏదో ఒక రీతిలో మానవ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు. బాటసారులకు మజ్జిగ, అవసరమైన వారికి కిరాణా సరుకులు పంపిణీ చేశాడు. ప్రస్తుతం నిత్యం వీధుల్లో 12 పశువులకు దాణా అందజేస్తున్నట్లు వివరించాడు. ( పెళ్లి విందు అడ్డుకున్నారు..! )
సరాసరి ఎన్–95 మాస్కు
శ్వాసక్రియకు వీలుగా బంగారు మాస్క్‌కు చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. మందుల షాపుల్లో విక్రయిస్తున్న బంగారంతో తయారైన ఎన్–95 మాస్కు తరహాలోనే ఇది ఉంటుందని వివరించాడు. కరోనా మహమ్మారి మనుషుల సోకుల తీరు మార్చింది. వివాహాది శుభ కార్యాల్లో వస్త్రాలకు మ్యాచింగు మాస్క్‌లు తొడుగుతున్నారు. మాస్క్‌లపై వధూవరుల పేర్లు ముద్రించుకుంటున్నారు. షర్టు కొంటే మ్యాచింగు మాస్కు ఉచితమంటూ వ్యాపారాల్ని పెంపొందించుకుంటున్నారు. కరోనా నివారణకు మాస్కు తొడగడం అనివార్యం కావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment