సాక్షి బెంగళూరు: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల విద్యార్థులు ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనే కచ్చితంగా చదవాలనే నిబంధన రానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించడంతో పాటు స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విప్లవాత్మక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని కర్ణాటక జ్ఞాన ఆయోగ, అలాగే ప్రొఫెసర్ ఎస్‌జీ సిద్ధరామయ్య నేతృత్వంలోని కన్నడ అభివృద్ధి ప్రాధికార సంస్థలు పాఠశాలల సాధికారత, సంక్షేమం కోసం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుని తొలిసారిగా రాష్ట్రంలో కొత్త విద్యా నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయంపై మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు చర్చించారు. మంత్రివర్గ సబ్ కమిటీని ఈ అంశంపై పరిశీలన జరిపి, ఎలాంటి న్యాయపర ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థలో కొత్త విధివిధానాలను రూపొందించాలని తీర్మానించారు.
అంతేకాకుండా కొత్త నిబంధనలపై ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించి చివరగా చట్టం చేయాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం తీసుకురావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కన్నడ అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల పిల్లలు ఏ మీడియంలో చదవాలో తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కన్నడ మీడియం ఈ నేపథ్యంలో దీనిపై విద్యా, న్యాయ శాఖ అధికారులు సమావేశమై తీవ్రంగా చర్చించారు. త్వరలోనే ఈ రెండు శాఖల మంత్రులు సమావేశమవనున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు చేసే దోపిడీని నివారించేందుకు ప్రత్యేక సంస్థను రూపొందించాలని ప్రభుత్వం నిర్ధారించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తుండడంతో వాటిని నివారించేందుకు ఈ సంస్థ పని చేయనుంది. అలాగే ప్రతి ఏటా ప్రైవేటు విద్యా సంస్థల నమోదయ్యే రిజిస్ట్రేషన్లను కూడా ఈ సంస్థ పర్యవేక్షించనుంది.
కొత్త విద్యా నిబంధనలు ఎందుకు?
♦ ఏటా రూ. 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన విద్య లభించడం లేదు.
♦ ఉచితంగా విద్య, పుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, పాలు ఇస్తున్నప్పటికీ ఆశించినంత మేర ఫలితాలు రావడం లేదు. నాణ్యమైన టీచర్ల కొరత వేధిస్తోంది.
♦ చదువును మధ్యలోనే ఆపేస్తున్నపిల్లల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
♦ మౌలికవసతుల కల్పనకు నిధుల కొరత
♦ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లోపించడంతో ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు మొగ్గు
కొత్త విద్యా విధానం ఏమి?
♦ సమయం, స్థలం అనే అడ్డంకులను అధిగమించి నాణ్యమైన విద్యను అందించడం.
♦ ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను మెరుగుపరచడం.
♦ విద్యా హక్కును ఉన్నత పాఠశాల వరకు విస్తరించడం
♦ ఫిర్యాదులు, సలహాల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
♦ బయోమెట్రిక్ విధానంలో హాజరు
♦ మౌలిక వసతుల కల్పనను పెంపొందించడం
Comments
Please login to add a commentAdd a comment