
ఈ కార్తీ చెడ్డబ్బాయి అంటున్న జీవీ
చెన్నై : సినిమాల్లోనే కాదు చిత్ర పేర్లలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నారు యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్. సంగీత దర్శకుడిగా అర్ధ శతానికి చేరుకున్న ఈయన ఇప్పుడు హీరోగానూ బిజీ అయ్యారు. పెన్సిల్ పట్టి కథానాయకుడిగా నటనకు శ్రీకారం చుట్టిన జీ వీ... డార్లింగ్ అంటూ తొలుత తెరపైకి వచ్చి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో అందాల భామలు ఆనంది, మనీషాలతో డ్యూయెట్లు పాడుతున్నారు.
అదనపు ఆకర్షణగా ఆర్య, సిమ్రాన్ మెరవనున్నారు. ఆధిక్ రవిశంకర్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమా లు తుది దశకు చేరుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈసారి కెట్ట పయడా ఇంద కార్తీ(ఈ కార్తీ చెడ్డ అబ్బాయి) అంటూ తెరపైకి రానున్నారు.
ఈ చిత్రం ద్వారా దర్శకుడు విజయ్ శిష్యులు గుణ,శంకర్ కలిసి మెగాఫోన్ పట్టనున్నారు. జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎస్ నందగోపాల్ ఈ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు కోడంబాక్కం వర్గాల సమాచారం.