తమ అమ్మ జయలలిత విడుదలతో అన్నాడీఎంకే వర్గాల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉదయం నుంచి
సేలం : తమ అమ్మ జయలలిత విడుదలతో అన్నాడీఎంకే వర్గాల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూసిన పార్టీ వర్గాలు కోర్టు తీర్పుతో ఒక్కసారిగా రోడ్డు మీదకు పరుగులు తీశారు. సేలం, ఈరోడ్, నామక్కల్, మదురై, తిరుచ్చిలో సంబరాలు అంబరాన్నంటాయి. కర్ణాటక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠతో పార్టీ వర్గాలు ఎదురు చూశాయి. తమ అమ్మ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావం ఉన్నా ఎక్కడో తెలియని భయంతో బిక్కుబిక్కుమంటూ అన్నాడీఎంకే వర్గాలు టీవీలకు అతుక్కుపోయారు. సరిగ్గా పదకొండు గంటలకు అమ్మ నిర్దోషి అని తీర్పు వచ్చిందో లేదో ఒక్కసారిగా నాయకులు రోడ్డుపైకి పరుగులు తీశారు.
కన్పించిన వారందరినీ హత్తుకుంటూ, కరచాలనం చేస్తూ ఆనంద డోలికల్లో మునిగారు. అమ్మ ఫొటోలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. సేలం నగర కార్యదర్శి సెల్వరాజ్ నేతృత్వంలో బాణ సంచా పేల్చుతూ సందడి చేశారు. స్వీట్లు, లడ్డూలను పంచి పెట్టారు. సేలం యువజన విభాగం కార్యదర్శి సతీష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన చేతిలో ఉన్న పది రూపాయల నోట్ల కట్టలను విప్పి గాల్లో చల్లతూ ఆనంద తాండవం చేశారు. ఇక సేలం కొండా పట్టి పరిసరాల్లోని పార్టీ వర్గాలు ‘సింగం బయలు దేరింది... అన్న నినాదాలతో పోస్టర్లను ఆగమేఘాల మీద ఏర్పాటు చేశారు. సేలం, నామక్కల్, ఈరోడ్, తిరుచ్చి, మదురైలో సంబరాలు అంబరాన్నంటాయి. డీఎండీకే రెబల్ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే విశ్వాస పాత్రుడు సుందరరాజన్ మదురైలో ప్రజలతో కలసి స్టెప్పులు వేశారు.