లోక్‌సభ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయకతప్పదని మాజీ సీఎం, ప్రతిపక్షనేత కుమారస్వామి జోస్యం చెప్పారు.
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయకతప్పదని మాజీ సీఎం, ప్రతిపక్షనేత కుమారస్వామి జోస్యం చెప్పారు. విధానసౌధలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపక్ష పార్టీలేవీ సిద్ధును పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు రచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఆయన్ను పదవి నుంచి తొలగించడానికి తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారన్నారు.
జేడీఎస్ పార్టీ వల్ల తాను రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినట్లు సిద్ధరామయ్య చెప్పుకోవడం సత్యదూరమన్నారు. జేడీఎస్ జాతీయ అధ్యక్షుడైన దేవెగౌడపై ఆరోపణలు చేయడం మంచిదికాదని హితవు పలికారు. ఈ విషమై చర్చించడానికి ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలని సిద్ధరామయ్యకు కుమారస్వామి సవాల్ విసిరారు. కేఆర్‌ఎస్ డ్యాంలో రోజురోజుకూ నీటిమట్టం తగ్గిపోతోందన్నారు.
దీంతో బెంగళూరుతోపాటు చుట్టుపక్కల ఉన్న తొమ్మిది జిల్లాల ప్రజలు వేసవి రాకుండానే తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో కావేరి ప్రవహిస్తున్నా తాగునీటి కోసం పొరుగు రాష్ట్రమైన తమిళనాడు వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు కేంద్రప్రభుత్వ సవతితల్లి ప్రేమే కారణమన్నారు. రాహుల్ మేనియ రాష్ట్రంలో పనిచేయదన్నారు. పదేళ్ల తర్వాత కర్ణాటకపై ఆయనకు ప్రేమ పుట్టుకు వచ్చిందా అని కుమారస్వామి వ్యంగ్యంగా అన్నారు.