నవ కర్ణాటక పరివర్తన యాత్రలో యోగి దర్శనమిచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల గోదాను హనుమాన్, టిప్పుసుల్తాన్ల బరిగా మార్చేశారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను కనుక పంపివేస్తే, ఇక టిప్పును తలుచుకునేవారే ఉండరని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో హనుమంతుడు, ఇతర మహర్షులు, గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆరాధిస్తారే తప్ప, టిప్పును కాదని మీరు స్పష్టం చేస్తారని కూడా అన్నారు. కర్ణాటకలోనే హనుమంతుడు జన్మించాడన్న విశ్వాసం ఆధారంగా యోగి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇదే పూర్వకాలంలో అయితే మైసూర్ రాజ్యం మీద అయోధ్య పాలకుల దండయాత్ర అని పేరు పెట్టొచ్చు. కానీ 2018 నాటి రాజకీయ పరిభాషలో అయితే మాటల యుద్ధం అంటే సరిపోతుంది. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు ప్రాంతం వారే కూడా. ఆయనతో మాటల యుద్ధానికి తలపడినవారు యోగి ఆదిత్యనాథ్. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. గడచిన ఒక నెల నుంచి యోగి తనకున్న సమయాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటకల కోసం సమంగా వెచ్చిస్తున్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు కర్ణాటక కూడా గుజరాత్ మాదిరిగానే ప్రాణం నిలబడేటట్టు చేయగలిగేదేనని అనిపిస్తుంది.
పశ్చిమ భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తన పార్టీ బీజేపీ కోసం విశేషంగా ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోను ఆయన ఎన్నికల నగరాను మోగించినట్టే కనిపిస్తోంది. అక్కడ మరో ఐదు మాసాలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికలలో యోగి ప్రచారం వల్ల పార్టీకి ఎంతో లబ్ధి చేకూరింది. కమలం పరిస్థితి గడ్డుగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 35 సభలలో ఆయన పాల్గొన్నారు. వాటిలో 22 నియోజక వర్గాలు కమలం ఖాతాలో పడ్డాయి.
ఇప్పుడు కర్ణాటకలో గెలుపు కూడా బీజేపీకి కీలకమే. ఎందుకంటే దక్షిణాదిన అడుగు మోపడానికి ఆ పార్టీకి ప్రధాన ద్వారంలా పని చేస్తున్నది కర్ణాటకే. మరొక అంశం కూడా ఉంది. ఇప్పుడు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పాలనలో ఉన్న పెద్ద రాష్ట్రాలు రెండంటే రెండే. మొదటిది పంజాబ్, రెండోది కర్ణాటక. ఈ విషయం కూడా బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తూ, కచ్చితంగా గెలిచి తీరాలన్న కసిని పెంచుతోంది.
యోగి వెంట కర్ణాటక
కర్ణాటకలో యోగి పాల్గొన్న నవ కర్ణాటక పరివర్తన యాత్ర చిత్రాలను చూస్తే ఆయన నాయకత్వంలో నడవడం అనివార్యమన్నది స్పష్టమవుతుందని కర్ణాటక శాఖ నాయకులే అంగీకరిస్తున్నారు. ఆ చిత్రాలలో ఒకదాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వినమ్రంగా యోగి ముందు చేతులు జోడించి, కొంచెం ముందుకు వంగి కనిపిస్తారు. యోగి కటాక్ష వీక్షణాలతో కనిపిస్తారు. పార్టీ అధిష్టానం కరుణను పొందడానికి కూడా ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు కూడా అయిన యడ్యూరప్పకు ఇంతకు మించిన ప్రచారం మరొకటి దొరకదు.
కానీ ప్రస్తుతం కథల ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోనే అసలు సమస్య. కొన్ని మాసాల నుంచి ఆ సమస్య మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యర్థి బీజేపీని విమర్శించడానికి, ఇరుకున పెట్టడానికి వచ్చిన ఏ సదవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. లింగాయత్‌లకు హిందువేతరులన్న స్థాయి కల్పించాలన్న ప్రతిపాదనకు సిద్ధరామయ్య మద్దతు ఇచ్చారు. లింగాయత్‌లు కర్ణాటక జనాభాలో 17 శాతం ఉన్నారు. సంప్రదాయకంగా వీరు బీజేపీ మద్దతుదారులు. యడ్యూరప్ప కూడా ఆ వర్గానికి చెందిన ప్రముఖుడే. వీరికి రాష్ట్రంలో ఓబీసీ హోదా ఉంది. లింగాయత్‌లు 12వ శతాబ్దానికి చెందిన సంస్కర్త బసవేశ్వరుని సిద్ధాంతాలను పాటిస్తారు.
బసవన్న అని అంతా పిలుచుకునే బసవేశ్వరుడు హిందూ సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినవారు. ఆ క్రమంలోనే ప్రత్యేకమైన ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అదే వీరశైవం. ఈ పరిణామమే లింగాయత్ శాఖ సంప్రదాయ హిందూ ధర్మానికి చెందినది కాదన్న వాదనకు దారి తీసింది. ఈ వాదనకే కాంగ్రెస్ మద్దతు చెబుతోంది. దీనితో ఆ వర్గంలో చీలిక వచ్చింది. ఇదే బీజేపీని ఇరకాటంలోకి నెడుతోంది. ఆ వర్గం ఓటుబ్యాంక్‌ను కోల్పోవడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు.
లింగాయత్‌లను హిందూయేతర శాఖగా గుర్తించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, సిద్ధరామయ్య ఆ విషయం గురించి మళ్లీ పట్టించుకోకపోయినా, ఆ వర్గానికి చెందిన కొన్ని ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి. ప్రత్యేక మతశాఖగా గుర్తించాలన్న డిమాండ్‌కు వెనుక కొన్ని ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. ఆ వర్గం నడుపుతున్న విద్యా సంస్థలకు మైనారిటీ హోదా లభిస్తుంది. రుణమాఫీ పేరుతో కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కులం ఆధారంగా సిద్ధరామయ్య వేసిన ఈ ఎత్తుకు పై ఎత్తు వేయాలని, మతం ఆధారంగా బీజేపీ కథనాలు ఆరంభించింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆదిత్యనాథ్ రంగ ప్రవేశం చేయడంతోనే వారి గెలుపునకు మత కథనం పాఠ్యాంశమయింది.
స్థలపురాణాలతో సమరం
నవ కర్ణాటక పరివర్తన యాత్రలో యోగి దర్శనమిచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల గోదాను హనుమాన్, టిప్పుసుల్తాన్ల బరిగా మార్చేశారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను కనుక పంపివేస్తే, ఇక టిప్పును తలుచుకునేవారే ఉండరని యోగి అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో హనుమంతుడు, ఇతర మహర్షులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆరాధిస్తారే తప్ప, టిప్పు సుల్తాన్‌ను కాదని మీరు స్పష్టం చేస్తారని కూడా అన్నారు. ప్రస్తుతం కర్ణాటక అని పిలుచుకుంటున్న చోటే హనుమంతుడు జన్మించాడన్న విశ్వాసం ఆధారంగా యోగి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఒక సిద్ధాంతం ప్రకారం హంపీలో ఉండే ఆంజనేయ పర్వతం మీదే మారుతి జన్మించాడు. కర్ణాటక పశ్చిమ తీరంలోని గోకర్ణ పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉండే ఒక కొండ మీద ఉన్న గుహ ఆయన జన్మస్థలమని చెప్పే స్థల పురాణం కూడా ఉంది. అయితే అంజనీపుత్రుడి జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పే కథలు కూడా వినిపిస్తాయి. మారుతి జన్మించిన గడ్డ మీద టిప్పు పేరుతో ఉత్సవాలు జరపడం ఏమి సబబని బీజేపీ ప్రశ్నిస్తోంది. టిప్పు మహమ్మదీయ పాలకుడని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి తరం యోధులలో ఒకడు కూడా కాదని చెప్పడమే ఈ ప్రచారం లక్ష్యం.
అలాగే టిప్పు ఉత్సవాలు జరపడం సమర్థనీయమేనని కాంగ్రెస్ చేత చెప్పించడం కూడా. తద్వారా ఆ పార్టీ ముస్లిం అనుకూల పార్టీ అని ముద్ర వేసి, హిందూ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడమే బీజేపీ వ్యూహం. అయితే ఉత్తరాదిన పనిచేసిన ఈ వ్యూహం వింధ్య పర్వతాలకు ఇవతల దక్షిణాదిన ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి.
టిప్పు మీద కన్నడిగుల దృష్టి వేరు
అయితే ఉత్తరాది నాయకత్వం అవలంబిస్తున్న ఈ తరహా వ్యూహంతో కర్ణాటక పార్టీ శాఖలోని వారంతా ఏకీభావం ఉన్నవారు కాదు. రాష్ట్ర బీజేపీ నేతలు ఎంత చెబుతున్నా కన్నడ ప్రాంత హిందువులు చాలామంది టిప్పును కరుడు గట్టిన మహమ్మదీయునిగా పరిగణించడం లేదు. పైగా మైసూర్ సింహంగానే చూస్తున్నారు. గుజరాత్‌లో వలెనే చర్చను ఎవరు మంచి హిందువు, లేదా ఎవరు పెద్ద హిందువు అన్న విషయం వరకు తెచ్చి పలచన చేశారు. ‘నా పేరేమిటి? సిద్ధరామ. నా పేరులోనే రాముడు ఉన్నాడు. మనం రామ జయంతి, హనుమత్ జయంతి జరుపుతాం. అలాగే టిప్పు జయంతి కూడా జరుపుతాం. అందరి జయంతులు మనం జరుపుకుంటాం’ అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి.
అయితే సమీకరణలను మార్చే ఇలాంటి కథనం వల్ల కర్ణాటక కోస్తా తీరంలో బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతం బీజేపీకి కంచుకోట. ఈ పరిణామాలతో ఆ బలం మరింత పటిష్టమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎజెండా మర్మమేమిటో వివరించే ప్రయత్నం చేయకుండా యోగి ఆదిత్యనాథ్‌ను సోషల్ మీడియా కేంద్రంగా ఇరుకున పెట్టేందుకు చూస్తున్నది. దీనితో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆన్‌లైన్‌లో వ్యంగ్య విమర్శలు, చురకలు వేసుకుంటూ మాటల యుద్ధానికి దిగే పరిస్థితి ఏర్పడింది. ‘మీరు మా నుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది సార్! మీరు రాష్ట్రంలో ఉన్నప్పుడు మా ఇందిరా క్యాంటీన్‌ను, రేషన్ దుకాణాన్ని పరిశీలించండి. మీ రాష్ట్రంలో జరుగుతున్న ఆకలిచావులకు పరిష్కారం ఏమిటో అవి మీకు తెలిసేటట్టు చేస్తాయి’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
ఇందుకు, ‘మీ కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా మీ హయాంలో చాలా ఎక్కువ జరిగాయని విన్నాను. మీరు వాటిని పట్టించుకోకుండా నిజాయితీపరులైన అధికారులను బదలీచేయడం మీద దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీ మిత్రులు సృష్టించిన విషాదాన్ని తుడిచిపెట్టడానికి కృషి చేస్తున్నాను’ అంటూ యోగి కూడా స్పందించారు. గుజరాత్ బాటలోనే ఎవరు నిజమైన హిందువు, ఎవరు పెద్ద హిందువు అన్న అంశం కూడా ముందుకు వచ్చింది.
హిందువులు గోమాంసం తినరాదంటూ యోగి చెప్పడం గురించి కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘సిద్ధరామయ్య హిందువు కాలేరు. ఎందుకంటే ఆయన గోమాంస భక్షణ చేయవచ్చునని చెబుతారు. సిద్ధరామయ్య కనుక హిందువే అయితే ఆయన హిందుత్వ గురించి మాట్లాడితే ఆయన గోమాంస భక్షణ చేయకూడదు. గోవధను అనుమతించరాదు’ అని యోగి అన్నారు. ఇందుకు సిద్ధరామయ్య ఇలా చెప్పారు, ‘చాలామంది హిందువులు గోమాంసం తింటారు. నేను కూడా తినాలనుకుంటే తింటాను. గోమాంసం తినవద్దని నాకు చెప్పడానికి వారు ఎవరు? కానీ నేను తినను. ఎందుకంటే నాకు రుచించదు కాబట్టి తినను.’ ఈ ధోరణి నుంచి కర్ణాటక బీజేపీ ఎప్పుడు బయటపడుతుంది? యోగి ముందుకు తెస్తున్న చిన్న చిన్న అంశాల నుంచి ఎప్పుడు దృష్టి మళ్లించుకుంటుంది? రాష్ట్ర పార్టీ శాఖలో ఐక్యత లేదు.
ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పనే ప్రతిపాదిస్తున్నారు. కానీ, పార్టీ ఎంతో కీలకమని భావిస్తున్న వచ్చే ఎన్నికల సమరంలో నాయకులందరినీ కలుపుకుని పోగల సత్తా ఆయనకు ఉందా లేదా అన్నది ఇప్పటికీ సందేహమే. పార్టీలో పెద్ద తలలు లెక్కకు మించి ఉన్నాయి. ఎవరి ఆశలు, స్వప్రయోజనాలు వారివే. అయితే ఎన్నికలకు కాస్త ముందు అనంత్‌కుమార్ హెగ్డేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు యడ్యూరప్పలో అభద్రతాభావాన్ని కలగచేస్తున్నాయి. ఇందుకు కారణం ఉంది. వివాదాస్పద ప్రకటనలకు పేర్గాంచిన ఈ డాక్టరు పార్టీ ఆశయం మేరకే అలా వ్యహరిస్తున్నారు. కర్ణాటక ఎప్పుడూ రాజకీయ నాటకానికి ప్రసిద్ధి. ఒక విభజన అంకానికి ఈ వేసవి వేదిక కావచ్చు.
టీఎస్ సుధీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment