మోడీ అభివృద్ధి మేడిపండు
= చిరు వ్యంగ్యాస్త్రం ..
= మొయిలీ వల్లే ‘ఎత్తినహోళె’
= మళ్లీ గెలిస్తే కరువు నుంచి జిల్లా విముక్తి
= కేంద్ర మంత్రిగా ఆయన సేవలు ఘనం
= పేలవంగా చిరు ప్రచారం
= ఆనేకల్ రోడ్డు షో రద్దు
గౌరిబిదనూరు/యలహంక/చిక్కబళ్లాపురం/బాగేపల్లి, న్యూస్‌లైన్ : గుజరాత్‌లో నరేంద్ర మోడీ అభివృద్ధి మేడిపండు లాంటిదని కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి వ్యంగ్యమాడారు. చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీ తరఫున సోమవారం ఆయన గౌరిబిదనూరు, యలహంక, చిక్కబళ్లాపురం, బాగేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ హయంలో గుజరాత్ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వందలాది చిన్న పరిశ్రమలు మూతపడి వేలాది కుటుంబాలు వీధిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని తాళలేకే ఇక్కడ కాంగ్రెస్‌కు పట్టంగట్టారని పేర్కొన్నారు.
ఈ కరువు జిల్లాలో సాగునీటి కోసం ఎత్తినహోళె పథకాన్ని అమలు చేయడానికి సుమారు రూ. 13 వేల కోట్ల నిధులను కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తీసుకొచ్చారని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి తీసుకురావడం ఆయన వల్లే సాధ్యమని అన్నారు. ఆయన్ను గెలిపిస్తే ఈ జిల్లా కరువు నుంచి విముక్తి పొందుతుందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి పలు సేవలు చేశారని, ఆయన చాలా దూర దృష్టి కల వ్యక్తి అని కొనియాడారు. సీఈటీ పరీక్ష విధానాన్ని అమలు చేసి పేద విద్యార్థులకూ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు.
‘చిరు’ స్పందన ...
హైదరాబాద్ నుంచి ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు వచ్చిన చిరంజీవి, చిక్కజాలలోని తన సొంత గెస్ట్ హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత యలహంకలోని కొండప్ప లేఔట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ స్కూలు విద్యార్థులే పెద్ద సంఖ్యలో కనిపించారు. తర్వాత చిక్కబళ్లాపురం, బాగేపల్లి, గౌరిబిదనూరులలో జరిగిన రోడ్డు షోలలో పాల్గొన్నారు.
చిక్కబళ్లాపురంలో ఓ మోస్తరుగా అభిమానులు కనిపించినా, వారిలోనూ కళాశాల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. బాగేపల్లిలో కూడా అభిమానులు ఫర్వాలేదనిపించారు. గౌరిబిదనూరులో రోడ్డు షో పేలవంగా సాగింది. చివరగా చిరంజీవి బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం ఆనేకల్‌లో రోడ్డు షో నిర్వహించాల్సి ఉన్నా రద్దు చేసుకుని సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు.