హైదరాబాద్(గోల్కొండ): ప్రధాని మోదీ హయాంలోనే పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింద ని ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవా రం గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షోను సినీనటుడు చిరంజీవితో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ హయాంలోనే అన్ని రాష్ట్రాలలో టూరిజంకు ఆదరణ పెరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. గోల్కొండ కోటలో ప్రస్తుతమున్న లైట్ అండ్ సౌండ్ షోకు మరింత ఆధునిక సాంకేతికత జోడించి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేశామన్నారు.
ఈ లైట్ అండ్ సౌండ్ షో ప్రతి రోజూ మూడు భాషల్లో ఉంటుందని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా పర్యాటకులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేస్తామన్నారు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను రూ.1300 కోట్లతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్‌షో వచ్చే నెలలో ప్రారంభమవుతుందని, దీనికి వాడుతున్న లేజర్ లైట్లు దేశంలోనే అత్యుత్తమమైనవని తెలిపారు. వరంగల్ కోటలో కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తామని, వెయ్యి స్తంభాల గుడిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు.
గిరిజన పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ తాను కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్కొండ కోటలో 50 దేశాల ప్రతినిధులతో సమావేశమైన వారికి లైట్ అండ్ షో చూపించామన్నారు. మగధీరతో పాటు రామ్‌చరణ్‌తో కలిసి గోల్కొండ కోటలో తాను సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, ఏఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ యూఎస్.రావత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment