రసాయనం వద్దు... సహజం ముద్దు
హోలీ కేళీలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి
రసాయన రంగులకు దూరంగా ఉండాలి
బెంగళూరు: కొద్ది రోజుల్లో హోలీ పండుగ రానుంది. సగటు మెట్రో నివాసి జీవితానిని ఉత్సాహంగా సప్తవర్ణాల శోభను అద్దేందుకు రంగుల కేళీ హోలీ వచ్చేసింది. సప్తవర్ణ శోభితమైన హోలీకి స్వాగతం చెప్పడానికి నగర వాసులు కూడా హుషారుగా సన్నద్ధమయ్యారు. అయితే హోలీ రోజున కాసిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడడం ద్వారా చర్మానికి హాని జరక్కుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక హోలీ కారణంగా నీటిని వృథా చేసే పద్ధతికి కూడా స్వస్తి పలకాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల 5న హోలీ జరుపుకోనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక కథనం.
సహజ రంగులతో హోలీ
సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పెట్టేది చర్మ సమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలు కలిసి ఉండడమే. ఈ తరహా రంగులు శరీరంపై ఎక్కువ సేపు ఉంటే చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ తరహా రంగులు పొరపాటున పడితే కళ్లకు చాలా ప్రమాదం కూడా. అందుకే హోలీ ఆడే సమయంలో మనం ఎంచుకునే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
వీలైనంత వరకు రసాయనాలు కలిపిన రంగులకు దూరంగా ఉండాలని వైద్యుల ఉవాచ. వీటికి బదులు సహజసిద్ధంగా తయారైన రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని స్కిన్ స్పెషలిస్ట్ సుహానా తెలిపారు. ‘రసాయన రంగులకు బదులు హెన్నా(గోరింటాకు పొడి), పసుపు, కుంకుమ, చందనం, టమాట గింజలతో తయారైన పొడి ఇలా సహజసిద్ధ రంగులను హోలీలో ఆడడం వల్ల చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు చర్మ సంబంధ వ్యాధుల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఒక వేళ రసాయన రంగులతోనే హోలీ ఆడాల్సిన పరిస్థితి ఉంటే కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి.
నీటి విషయంలో జాగ్రత్త
ఇక హోలీ వేళ నగరంలోని వివిధ షాపింగ్ మాల్స్, కూడళ్లతోపాటు అపార్ట్‌మెంట్లు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా రంగులను నీటిలో కలిపి చల్లుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో రంగులను కలపడానికి ఎంచుకునే నీరు పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశాలు చాలా తక్కువ. ఇక షాపింగ్‌మాల్స్ వంటి ప్రాంతాల్లో అయితే ఏదో దొరికిన నీటిలోనే రంగులను కలపడంతోపాటు ఒకసారి చల్లుకున్న రంగునీటిని మళ్లీ సేకరించి తిరిగి అదే నీటిని పైపుల ద్వారా పంపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో అపరిశుభ్రమైన నీటిలో రంగులను కలిపి హోలీ ఆడడం వల్ల అనేక చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది వైద్యుల హెచ్చరిక. ఇక నగరంలో వేసవి ఛాయలు ప్రారంభమైన తరుణంలో హోలీ పేరిట నీటిని వృథా చేయవద్దని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు బదులుగా ‘డ్రై హోలీ’ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నారు.
ఈ సూచనలు పాటిస్తే మేలు
రసాయనాలు కలిసిన రంగులతో హోలీ ఆడితే, వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయకండి. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోండి.
ఎక్కువగా ఎరుపు, పింక్ రంగులనే హోలీ కోసం వాడండి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండడంతో శరీరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా శరీరంపై నుంచి తొలగిపోవు.
హోలీ ఆడడానికి ముందు మీ ముఖానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోండి. దీని వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది.
ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా క్లెన్సింగ్ మిల్క్ ఉత్తమం.
చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్ కలిపి రాస్తూ ఉంటారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఎటువంటి ఆయిల్స్ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అడ్డుకోవచ్చు.