
కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి
► గ్రనేడ్లు విసురుతూ.. క్యాంపులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
► ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టిన భద్రతాదళాలు
► ఒక జవాను వీర మరణం.. ఇద్దరు జవాన్లకు గాయాలు
శ్రీనగర్: ఉడీ ఘటన తరహాలోనే శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగారు. ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ క్యాంపులోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీన్ని భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. గంటసేపు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. ఓ జవాను అమరుడవగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని ఆర్మీ వెల్లడించింది. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సమీపంలోని పార్కు నుంచి.. క్యాంపులోకి చొచ్చుకు వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
ఈ ఘటనలో ఐదారుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఆర్మీ క్యాంపు సమీపంలో పరిస్థితి ఆర్మీ అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. కాగా, తప్పించుకున్న మరో నలుగురు ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. తాజా పరిస్థితిని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు వివరించారు. పాక్‌పై సర్జికల్ దాడులు జరిగి మూడ్రోజులు కూడా గడవక ముందే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. బారాముల్లా పట్టణ శివార్లలో ఉన్న ఈ కేంద్రం శ్రీనగర్‌కు 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. జవాన్లతోపాటు ఈ ప్రాంత ఆపరేషనల్ కమాండ్ కూడా ఈ క్యాంపులోనే ఉంటుంది.
పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
మరోవైపు పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని పల్లన్‌వాలా సెక్టార్‌లో ఎల్వోసీ వెంబడి రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో భారత ఔట్‌పోస్టులపై మోర్టార్లు, భారీ మెషీన్‌గన్స్, అటోమేటెడ్ గన్స్‌తో కాల్పులకు దిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదని ఢిల్లీలోని ఆర్మీ కార్యాలయం స్పష్టం చేసింది. సర్జికల్ దాడి జరిగిన తర్వాత పాక్ తరఫు నుంచి ఇది ఆరోసారి కాల్పుల ఉల్లంఘన. కాగా, సరిహద్దులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు పాక్ జాతీయులను భద్రతబలగాలు అదుపులోకి తీసుకున్నాయి.