
అట్టారీలో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు
♦ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు
♦ కశ్మీర్, పంజాబ్‌లలో స్కూళ్లకు సెలవులు
♦ వాఘాలో బీటింగ్ రిట్రీట్ రద్దు
న్యూఢిల్లీ/జమ్మూ:‘సర్జికల్ స్ట్రైక్స్’ నేపథ్యంలో భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రత కట్టుదిట్టం చేసింది. ప్రతిదాడి జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు.. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రత పెంచారు. పాక్ సరిహద్దులోని జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని బీసీఎఫ్ అధికారులు ఆదేశించారు. పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అట్టారి- వాఘా సరిహద్దులో జరిగే రిట్రీట్‌ను బీఎస్‌ఎఫ్ రద్దు చేసింది.
సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరముందని సరిహద్దు రక్షణ బలగాలు కేంద్రాన్ని కోరాయి. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద భద్రతా సిబ్బందిని పెంచాలని కేంద్రాన్ని కోరింది. సరిహద్దు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు త రలిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఆ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో 10 కిలో మీటర్ల మేర ఉన్న పాఠశాలలకు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ సెలవులు ప్రకటించారు.
ఆర్‌ఎస్ పురా వంటి పలు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండటం ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు. భారత దళాలు గుజరాత్‌లోని నౌషారీ బెల్ట్ ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇదే ప్రక్రియ పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాల్లోనూ కొనసాగుతోంది.