కార్పొరేటర్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే అరుణ్ గావ్లీకి పెరోల్ మంజూరైంది...
సాక్షి, ముంబై: కార్పొరేటర్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే అరుణ్ గావ్లీకి పెరోల్ మంజూరైంది. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ ధర్మాసనం (బెంచి) గురవారం ఆయనకు 15 రోజుల పెరోల్ ఇచ్చింది. కొడుకు మహేశ్ గావ్లీ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు 30 రోజులు పెరోల్ మంజూరు చేయాలని నాగపూర్ జైలు పరిపాలన విభాగానికి మార్చిలో గావ్లీ దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే జైలు అధికారులు పెరోల్ దరఖాస్తును తిరస్కరించారు.
దీంతో గావ్లీ బాంబే హై కోర్టులోని నాగపూర్ బెంచికి పిటిషన్ పెట్టుకున్నారు. గావ్లీ తరఫున న్యాయవాదులు రజనీశ్ వ్యాస్, మీర్ నగం అలీ పిటిషన్‌ను కోర్టుకు విన్నవించారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. గావ్లీ కుమారుడి పెళ్లి నాగపూర్‌కు చెందిన కృతిక అహిర్‌తో మే తొమ్మిదో తేదీన మహాలక్ష్మిలోని రేస్ కోర్స్‌లో జరగనుంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాతో పాటు నగరంలోని ప్రముఖ రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు.