
అమ్మ ఫార్మసీ... డోర్‌డెలివరీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : అమ్మ ఫార్మసీలకు పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపడంతో, మరిన్ని సేవలను పరిచయం చేయడానికి శ్రీకారం చుట్టింది. సబ్సిడీ ధరలపై పలురకాల పథకాలతో వెలుస్తున్న ‘అమ్మ’ కౌంటర్లు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. ముందుగా ఏర్పడిన అమ్మ క్యాంటిన్లు, ఆ తరువాత వరుసగా ప్రవేశపెట్టిన అమ్మ వాటర్ బాటిళ్లు, అమ్మ ఉప్పు ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. తొలిదిశగా ఏడు జిల్లాల్లో 10 అమ్మ ఫార్మసీలను ప్రారంభించారు. 10శాతం సబ్సిడీపై మందులు సరఫరా చేయడంతో నెలరోజులకు సరిపడా మందులు కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులు కోరిన మందులు లేనిపక్షంలో వెంటనే తెప్పించి అందజేస్తున్నారు.
మందుల స్టాకు వచ్చిన సమాచారాన్ని సెల్‌ఫోన్ ద్వారా చేరవేస్తున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా మందులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. అంతేగాక వినియోగదారులు కోరిన పక్షంలో కనీసం రూ.500 విలువైన మందులను డోర్‌డెలివరీ సైతం చేస్తామని చెబుతున్నారు. పైగా ఆయుర్వేదం, సిద్ద, యునానీ రకాల మందులు సైతం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీంతో కేవలం రెండు రోజుల క్రితమే వెలిసిన అమ్మ ఫార్మసీల వద్ద ఉదయం నుంచే జనం క్యూకట్టడం ప్రారంభించారు. నగరంలో ట్రిప్లికేన్, ఆశోక్‌నగర్, బీసెంట్ నగర్, కీల్‌పాక్, రాజా అన్నామలై పురం, రాయపేట, తేనాంపేట తదితర ప్రాంతాల్లో సహకారశాఖ కౌంటర్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నారు.