బెంగళూరు: కర్ణాటకలోని మండ్య జిల్లాలో దళిత యువతిని ప్రేమించాడనే కారణంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇది హత్య కాదని, ఆత్మహత్య అని చెబుతున్నారు. వివరాలు... మండ్య జిల్లాలోని కె.ఆర్.పేట తాలూకాలో సిందఘట్ట గ్రామానికి చెందిన నాగేష్, అదే ప్రాంతానికి చెందిన దళిత యువతి భవ్యా ప్రేమికులు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రేమను నాగేష్ కుటుంబం వ్యతిరేకిస్తూనే వస్తోంది. కాగా, ఈనెల 17న మండ్యలో మతాంతర వివాహం జరిగిన సమయంలో నాగేష్, భవ్యాల ప్రేమను సైతం విమర్శిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని సంఘాలు కరపత్రాలను ముద్రించి పంచాయి.
దీంతో నాగేష్ కుంగుబాటుకు గురయ్యాడు. అంతేకాక ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న భవ్యా, నాగేష్ తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కె.ఆర్.పేట పోలీస్ స్టేషన్‌లో పదిహేను రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నాగేష్ మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో గ్రామ శివార్లలో కనిపించింది. దళిత యువతితో ప్రేమ, ఆపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు వంటి ఘటనలతో గ్రామంలో తమ పరువు పోయిందని భావించిన నాగేష్ కుటుంబసభ్యులు అతడిని హత్య చేశారన్న వాదన గ్రామంలో వినిపిస్తోంది.