న్యూఢిల్లీ: ముద్దుల గోల దేశరాజధానికి తాకింది. యుక్త వయస్సులో ఉన్న ఎన్నో జంటలు ఉత్సాహంగా నగర వీధుల్లో పెదాల ముద్దుల సందడి చేశారు. కేరళలో మొదలైన ‘ముద్దుల ఉద్యమం’ అక్కడా ఇక్కడా హంగామా చేస్తూ ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కుదుపేసి దేశరాజధానికి చేరింది. ప్రేమ ముద్దులకు పాల్పడుతున్న జంటలపై కొందరు చట్టాన్ని చేతుల్లోకి(మోరల్ పోలీసింగ్ చర్య) తీసుకొని అమానుషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, భారీ ఎత్తున మహిళలు శనివారం మధ్యాహ్నం మధ్య ఢిల్లీ జనదేవాలన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిరసనకారులు మానవహారంగా ఏర్పడి ప్రేమ ముద్దులతో నిరసన వ్యక్తం చేశారు. వారి చుట్టూ వేలాది మంది గుమిగూడారు.
కొన్ని హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు అక్కడికి చేరుకొని ‘లిప్‌లాక్’ ఉద్యమకారులతో వాగ్వావాదానికి దిగారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ప్రేమతత్వం మంచిదే.. కానీ అది హిందూ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకూడదు’ అని నినాదాలు చేశారు. ముద్దుల జంటలతో కూడిన బ్యానర్లు చేతబట్టుకొని ఆందోళనకారులు, హిందూ సంస్థల కార్యకర్తల చుట్టుముట్టడంతో ఉద్రిక్తతగా మారింది. భారతీయ సంస్కృతి వ్యతిరేకతను ముద్దుల ప్రేమికులు కాలరాస్తున్నారని హిందూ సంస్థల నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 70 మంది విద్యార్థినీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, అరగంట తర్వాత వదిలిపెట్టారు. ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థి విభాగం ఏబీవీపీ విద్యార్థులు ముద్దుల ఉద్యమాన్ని తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీకి చేరిన ముద్దుల గోల
Published Sun, Nov 9 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement