
మానవ జన్మ సార్థకతకు సాధన అవసరం
మానవ జన్మ సార్థకతకు సాధన ఎంతో అవసరమని విరక్తమఠం బసవ ప్రభు స్వామీజీ అన్నారు.
దావణగెరె, న్యూస్‌లైన్ : మానవ జన్మ సార్థకతకు సాధన ఎంతో అవసరమని విరక్తమఠం బసవ ప్రభు స్వామీజీ అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని ఎస్‌జేఎం పబ్లిక్ స్కూల్, శ్రీ బక్కేశ్వర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సాహస ప్రదర్శన కార్యక్రమాన్నుద్దేశించి మాట్లాడారు.
నేటి యువత కేవలం సరదాలు, సంబరాలతో తమ జీవితాలను పాడు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఏమీ సాధించలేమనే నిస్సహాయ భావాన్ని విడనాడి ఏదైనా సాధిస్తామనే మనోభావాన్ని పెంచుకోవాలన్నారు. ఏదైనా సాధన చేయాలంటే అందుకు కఠోర ప్రయత్నం, కృషి అవసరమన్నారు. మొదటి ప్రయత్నంలో విఫలమైతే తన వల్ల కాదనుకోరాదని, మళ్లీ ప్రయత్నిస్తే సాధించడం తథ్యమన్నారు.
ఈ సందర్భంగా గౌతమ్ వర్మ తన దంతాలతో 45 సెకన్లలో రెండు కొబ్బరికాయల పీచు వలిచి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అలాగే 80 కేజీల బరువున్న బియ్యం బస్తాను పళ్లతో పెకైత్తాడు. చెవికి తాడు కట్టుకుని మారుతి 800 కారును లాగుతానని, నడుస్తున్న బైక్‌పై ఒక బకెట్ నీళ్లతో స్నానం, భోజనం చేసే సాహసాలను కూడా చేయగలనని యన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్యా నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.