పాము విషం ఇంజెక్షన్ చేసి.. భార్యను కడతేర్చాడు!
పాము విషం ఇంజెక్షన్ చేసి.. భార్యను కడతేర్చాడు!
Published Tue, Nov 1 2016 11:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
తరచు గొడవ పడుతూ, వివాహేతర సంబంధం ఉందంటూ వేధిస్తున్న భార్యకు ఇంజెక్షన్ ద్వారా పాము విషం ఎక్కించి చంపేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో జరిగింది. ఈ వివరాలను రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ పుల్లారావు విలేకరులకు వెల్లడించారు. అక్టోబరు 22న ఏడిద గ్రామానికి చెందిన షేక్ షహీదా బేగం (36) అనుమానాస్పదంగా మరణించింది. ఆమెను చంపింది తానేనంటూ భర్త మొఘలా సాహెబ్ 30వ తేదీన పోలీసుల వద్ద లొంగిపోయాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది.
మొఘలా సాహెబ్‌కు షహీదా బేగంతో 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె తరచు భర్తతో గొడవపడుతూ, పుట్టింటికి వెళ్లి, నెలల తరబడి ఉండిపోయేది. భర్తకు భోజనం కూడా సరిగా పెట్టేది కాదు. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తను వేధించేది. దీంతో ఆమెను అంతమొందించాలని మొఘలా సాహెబ్ నిర్ణయించుకున్నాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, పాము కరిచి చనిపోయిందని నమ్మించేలా ప్రణాళిక వేశాడు. ఏడిద రోడ్డులో పాములు పట్టేవారి వద్దకు వెళ్లి.. ఆయుర్వేదం మందులోకి కావాలంటూ విషం సేకరించాడు. 22న ఉదయం షహీదాబేగంకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆర్‌ఎంపీతో వైద్యం చేయించాడు. అతడు వెళ్లిపోయాక పాము విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె కుడిచేతిలోకి ఎక్కించాడు. ఆమె కేకలు వేయగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే ఆమె మరణించింది.
Advertisement
Advertisement