రేవ్ పార్టీలో పాము విషానికి అంత డిమాండ్ ఎందుకు?
స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి?
రేవ్ పార్టీలలో బడాబాబులు, సెలబ్రేటీలు అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు సాధారణంగా వినిపించేవి. మరి కొందరు మత్తు పదార్థాలూ తీసుకుంటారు. మరి సీక్రెట్‌గా పోలీసుల కంట పడకుండా రేవ్ పార్టీల్లో పాము విషం ఎందుకు హల్‌చల్ చేస్తోంది. పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో పాము విషానికి కోట్లాది రూపాయల డిమాండ్ ఎందుకు? చాలామంది సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్‌లా ఎందుకు వాడుతున్నారు? వివరాలను ఒకసారి చూద్దాం!
ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ 'బిగ్ బాస్' విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీలలో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్‌లో నాగుపాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.
స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి?
అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాముల విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్‌గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘోరమైన రూపంగా అవతరిస్తోంది. ఈ పౌడర్‌లోని న్యూరోటాక్సిన్‌ల కారణంగా విపరీత మైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యససాన్ని అఫిడిజం అని పిలుస్తారు. బాగా ఎత్తును పొందుతారు, ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు-ఏడు గంటల నుంచి ఐదు-ఆరు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది.
నిజానికి స్నేక్ వెనమ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది , ప్రాణాంతకమైనది కూడా. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీన్ని సేవిస్తారట. స్నేక్ వెనమ్ ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్‌ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం చాలా కొద్ది పరిమాణంలో విషంతో తయారు చేస్తారట. ముఖ్యంగా విదేశాల్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ, ఇది క్రమ మన దేశానికి పాకుతుండటం గమనార్హం. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట.
పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది?
కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు లాంటితో పోలిస్తే నాగు పాములే అత్యంత విషపూరితమైనవిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయట. అయితే వీటిలో 25 శాతం మాత్రమే విషపూరితమైనవి. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరతాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి, గుండెలోని రక్తం గడ్డ కట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాల నష్టం,శాశ్వత వైకల్యం , అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు.
ప్రతీ ఏడాది 50 లక్షలమందికిపైగా పాము కాటు
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫికా, ఆసియా, మధ్య , దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81 వేలనుంచి లక్షా,38 వేల దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. మూడు రెట్లకు పైగాబాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment