విషం సేవించి భార్యాభర్తల ఆత్మహత్య
Published Thu, Oct 24 2013 3:48 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
వేలూరు, న్యూస్‌లైన్: అప్పుల బాధ తట్టుకోలేక పుదుకోట్టై జిల్లాకు చెందిన ఒక కుటుంబ తిరువణ్ణామలైలోని లాడ్జిలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. పుదుకోట్టై జిల్లా మరమలై నగర్‌కు చెందిన శేఖర్(57) టైలర్ వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య హేమమాలిని (55), కుమారుడు పురనేశ్వరన్(17) ఉన్నారు. కుమారుడు ప్లస్‌టూ చదువుతున్నాడు. వీరు మంగళవారం తిరువణ్ణామలై చేరుకొని అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పోలూర్ రోడ్డులోని ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల వరకు వారి గది తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు తట్టారు.
ఎంతసేపటికీ స్పందిం చక పోవడంతో గదిపైనున్న కిటికీల్లో చూడగా వారి నోటిలో నురుగు వచ్చి మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పయణి, పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే శేఖర్, హేమమాలిని మృతి చెందారు. పురనేశ్వరన్ కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నాడు. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గదిని పరిశీలించగా మంచంపై విషం బాటిళ్లు, శీతల పానీయాలు, వాటి పక్కన ఒక లెటరు ఉండడాన్ని గమనించారు. ఆ లేఖలో అప్పుల బాధ తాళలేక, వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసివుంది. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురనేశ్వరన్ పరిస్థితి విషమంగా ఉంది.
Advertisement
Advertisement