నావి వందల ఎకరాలు పోయాయి: కేసీఆర్
హైదరాబాద్: భూమి పోతే ఎలాంటి బాధ ఉంటుందో తనకు తెలుసని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే, ప్రాజెక్టులు కట్టే సమయంలో భూములు పోవడం సహజమని బహుళ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వాటిని అర్ధం చేసుకోవాలని కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంపై మాట్లాడారు. మల్లన్న సాగర్‌పై ప్రతిపక్షాలు అనవరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని మండిపడ్డారు. అందుకే కుట్రలు చేసి పోలీసులు కాల్పులు జరిపేదాక తీసుకెళ్లారని అన్నారు.
ముదిగొండలోలాగే మల్లన్న సాగర్ విషయంలో కూడా చేయాలని సీపీఎం ప్రయత్నించిందని ఆరోపించారు. భూమిపోతే ఆ బాధేంటో తనకు తెలుసని అప్పర్ మానేరులో తాను వందల ఎకరాలు కోల్పోయానని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వని పరిహారం తాము ఇస్తున్నామని రిజిస్ట్రేషన్ ధరకంటే తాము పది శాతం అదనంగా చెల్లిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ కట్టుకునేందుకు రూ.5.4లక్షలు ఇస్తున్నామని, రైతులకు మేలు చేయాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు. 2017 డిసెంబర్ నాటికి మల్లన్న సాగర్ పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018 జూన్ కల్లా గోదావరి జలాలను ఉత్తర తెలంగాణకు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.