ఒకే వేదిక మీదకు న్యాయ విద్యార్థులు
గుర్తింపు కార్డులు దగ్ధం చేస్తామని హెచ్చరిక
ఐదో రోజుకు న్యాయ విద్యార్థుల నిరసన
న్యాయం కోసం ఆందోళనల్ని ఉధృతం చేయడానికి న్యాయ విద్యార్థులు నిర్ణయించారు. అన్ని కళాశాలల విద్యార్థుల్ని ఒకే వేదిక మీదకు తెచ్చి ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. తమ గుర్తింపు కార్డుల్ని తగల బెడతామని హెచ్చరించారు. కళాశాల మార్పు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ రోశయ్యకు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, చెన్నై : చెన్నై బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల మార్పు నిర్ణయం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఐదు రోజులుగా కళాశాల ఆవరణలో నిరసన కొనసాగిస్తున్నారు. తమ నిరసనకు రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభిస్తున్నా, ప్రభుత్వం మాత్రం కనీసం చర్చలకు చర్యలు చేపట్టక పోవడాన్ని న్యాయ విద్యార్థులు తీవ్రంగా పరిగణించారు. ఆదివారం నిరసనలో ఉన్న విద్యార్థులకు కొన్ని రాజకీయ పక్షాల అనుబంధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలియజేశాయి.
ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా విద్యార్ధి సంఘాలన్నీ ఏకమయ్యేందుకు నిర్ణయించాయి. తమ ఆందోళనల్ని ఉధృతం చేసే విధంగా కార్యాచరణనుసిద్ధం చేశాయి. తమ ఆందోళనల్ని ఉధృ తం చేస్తూ, నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు నిర్ణయించారు. విద్యార్థి జేఏసీగా ఏర్పడి నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల మద్దతు కూడ గట్టుకుని ‘న్యాయం’ కోసం ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా ఆందోళనలు చేపట్టబోతున్నారు.ఈ ఆందోళనల్లో భాగంగా ముందుగా తమ గుర్తింపు కార్డుల్ని తగుల బెట్టే రీతిలో నిరసనకు నిర్ణయించారు. తదనంతరం రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి మొర పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో విద్యార్థుల సత్తాను చాటే విధంగా ముందుకు సాగబోతున్నారు. పలువురు విద్యార్థులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు.
జోక్యం చేసుకోండి
తమ నిరసనల్ని ఉధృతం చేయడానికి న్యా య విద్యార్థులు, ఇతర కళాశాల విద్యార్థు లు సన్నద్ధం కావడంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ రోశయ్యను డీఎంకేఅనుబంధ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్ భవన్‌లో విద్యార్థుల ఆందోళనలు, డిమాండ్లను వివరిస్తూ లేఖను అందించారు. ఆదివారంతో న్యాయ విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరినా, ఇంత వరకు ప్రభుత్వం స్పందించక పోవ డం శోచనీయమని గుర్తు చేశారు. చర్చలకు గానీ, ఆందోళనలు విరమించాలన్న సూచనను కూడా పాలకులు ఇవ్వని దృష్ట్యా, విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. తమరైనా జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విన్నవించారు. న్యాయ కళాశాల మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఆందోళన ఉధృతం
Published Mon, Feb 9 2015 3:49 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
Advertisement
Advertisement