ఫుట్ బోర్డుపై కనిపిస్తే బస్సు పాసులు రద్దు | Students travelling on footboard poised to lose bus pass | Sakshi
Sakshi News home page

ఫుట్ బోర్డుపై కనిపిస్తే బస్సు పాసులు రద్దు

Published Thu, Jan 22 2015 9:24 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

ఫుట్ బోర్డుపై కనిపిస్తే  బస్సు పాసులు రద్దు - Sakshi

ఫుట్ బోర్డుపై కనిపిస్తే బస్సు పాసులు రద్దు

వీరంగాలు సృష్టించినా, ఆకతాయితనంతో వ్యవహరించినా, బస్సు ఫుట్ బోర్డులో వేలాడుతూ కన్పించినా...క్రమ శిక్షణ కొరడాను విద్యార్థుల మీద ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫుట్ బోర్డులో వేలాడుతూ కనిపించే విద్యార్థుల ఉచిత బస్సు పాసులు రద్దు అవుతాయి. వీరంగాలు సృష్టిస్తే టీసీలు ఇవ్వడంతో పాటుగా ఎక్కడా చదివేందుకు వీలు లేనంతగా చర్యలు తీసుకుంటారు. ఈ దృష్ట్యా, ఇకనైనా విద్యార్థులు జాగ్రత్తగా మసలుకునేందుకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
 సాక్షి, చెన్నై:చెన్నై నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే  ప్రైవేటు కళాశాలల విద్యార్థుల మధ్య తరచూ వివాదం రాజుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని మార్గాల్లో తిరిగే బస్సుల్లో కొందరు విద్యార్థులు మరీ శ్రుతి మించి వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, పెద్దలు ప్రయాణించలేని పరిస్థితి. విద్యార్థులు దురుసుగా వ్యవహరించడం ఏకంగా వివాదాలకు దారి తీస్తోంది. బస్సుల్లో ఫుట్ బోర్డుల మీద వేలాడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడంతో పాటుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. కళాశాల్లో చోటు చేసుకునే గొడవలు, వ్యక్తిగత వివాదాలు, ప్రేమ తగాదాలతో విద్యార్ధులు వీధి రౌడీల్లో అనేక చోట్ల వ్యవహరిస్తున్నారు. వీరిపై కొరడా ఝుళిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది.
 
 ఈ కమిటీ ఆయా మార్గాల్లో పరిశీలనలు జరపడంతో పాటుగా సేకరించిన సమాచారాల మేరకు వీరంగాలు సృష్టించే, ఫుట్ బోర్డుల్లో వేలాడే విద్యార్థుల నడ్డి విరిచే విధంగా చర్యలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.  ఆ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన విద్యాశాఖ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఆ కమిటి తన నివేదికలో కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసి ఉంది. ఆ మేరకు ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు వీరంగాలు సృష్టించినా, వివాదాల్లో ఇరుక్కున్న తొలి హెచ్చరికగా వారి తల్లిదండ్రుల్ని పిలింపించి మందలించి పంపనున్నారు. అప్పటికీ ఆ విద్యార్థిలో మార్పు రాని పక్షంలో కళాశాల గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకుంటారు.
 
 అప్పటికీ మారని పక్షంలో టీసీ ఇవ్వడం లేదా, మరే ఇతర కళాశాలల్లో చేరనీయకుండా అతడి సర్టిఫికెట్లను రద్దు చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. బస్సుల్లో ఫుట్ బోర్డు మీద వేలాడుతూ కన్పిస్తే చాలు వారి ఉచిత బస్సు పాసుల్ని స్వాధీనం చేసుకుంటారు. తొలి సారిగా హెచ్చరించి పంపుతారు. మళ్లీ మళ్లీ ఫుట్ బోర్డులో కన్పిస్తే, ఏకంగా ఉచిత బస్సు పాస్‌ను రద్దు చేసే విధంగా ఆ నివేదికలో పేర్కొన్న అంశాల్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఫుట్ బోర్డుల్లో వేలాడే విద్యార్థుల భరతం పట్టేందుకు నగర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది, పోలీసుల సమన్వయంతో ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించుతూ ఆదేశాలు వెలువడటంతో ఆయా మార్గాల్లో ఎంత మంది విద్యార్థుల బస్సు పాసులు రద్దు కాబోతున్నాయో, టీసీలు ఇవ్వబోతున్నారోనన్నది వేచి చూడాల్సిందే.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement