కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు గర్జించాయి. చెన్నై ఐఐటీ వద్ద తీవ్రస్థాయిలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫొటోను త గలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఐఐటీలో దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నతవిద్య నభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగానే అనేక విద్యార్థి సంక్షేమ సంఘాలు వెలిశాయి. ఎవరికి వారు తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. ఇలా ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ విద్యార్థి సంఘం ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రధాని మోదీ పరిపాలన, పథకాల ను విమర్శించడమేగాక కరపత్రాలు ముద్రించి ప్రచారం చేపట్టింది. సదరు విద్యార్థి సంఘం కార్యకలాపాలను మద్రాసు ఐఐటీ యాజమాన్యం ఈనెల 7వ తేదీన కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ దృష్టికి తీసుకెళ్లింది.
విద్యార్థి సంఘం సమావేశంలో రాజకీయాలను ప్రస్తావించడమేగాక, ప్రధాని మోదీపై కరపత్రాలు ప్రచురించినందుకు ప్రతిచర్యగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సదరు విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. సంబంధిత శాఖా మంత్రి స్మృతిఇరానీ సైతం విద్యార్థి సంఘం రద్దును సమర్థించారు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. వివిధ విద్యార్థి సంఘాలన్నీ ఏకమై చెన్నై అడయారులోని ఐఐటీ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఓఎంఆర్ రోడ్డు నుంచి మధ్యకైలాష్ మీదుగా ఐఐటీ ప్రధాన ద్వారం వరకు వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నడిరోడ్డుపై నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తందెపైరియార్ ద్రావిడ కళగం, పురట్చికర మానవర్, ఇలైంజర్ మున్నని, ఇండియ జననాయక వాలిబర్ సంఘం తదితర సంఘాలకు చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అయితే పోలీసులు మధ్యలో అడ్డుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు గంటపాటు సాగిన ఆందోళన కారణంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించి పోయింది. మద్రాసు ఐఐటీని ముట్టడిం చేందుకు దూసుకురాగా బ్యారికేడ్లతో పోలీ సులు అడ్డుకున్నారు. ముట్టడి, ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినులు సైతం పోలీసులకు భయపడకుండా ఆందోళనలో పాల్గొని అరెస్టయ్యారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం శాస్త్రి భవన్ వద్ద కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆందోళన జరిపారు. సుమారు రెండు వందల మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనల కారణంగా ఐఐటీ, శాస్త్రిభవన్‌ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అరెస్టయిన విద్యార్థులను సమీపంలోని కల్యాణ మండపంలో ఉంచారు. అలాగే పుదుచ్చేరిలో రైలురోకోకు యత్నించిన విద్యార్థులను పోలీ సులు అరెస్టు చేశారు. విద్యాసంస్థకు చెందిన వివాదాన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కోరారు. రాజకీయ లబ్ధికోసం కొందరు గొడవలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థి సంఘంపై తీసుకున్న రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలని ఎండీఎంకే అధినేత వైగో విజ్ఞప్తి చేశారు.
ఐఐటీ ముట్టడి
Published Sun, May 31 2015 3:49 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
Advertisement
Advertisement