పెళ్లి చేసుకుంటే గ్రామ బహిష్కరణే..!
► కట్టుబాట్ల చెరలో శీగేబావి
► కుల పెద్దల మాటే వేదం
► తప్పు చేస్తే గ్రామ బహిష్కారం
► డిజిటల్ యుగంలో వింత
ఈ గ్రామంలో ఉన్న కురుబ సముదాయ ప్రజలు.. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే ఎవరూ ఎవరితో గొడవ పడరాదు. కుల పెద్దలు చెప్పినట్లు మాత్రమే నడుచుకోవాలి, కులాంతర వివాహం చేసుకోరాదు. కుల పెద్దల మాట జవదాటినా, నియమాలు ఉల్లంఘించినా వారికి జరిమానాతో పాటు గ్రామ బహిష్కార దండన తప్పదు. ఈ గ్రామం ఎక్కడో కాదు, బెంగళూరుకు సమీపంలో ఉన్న తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలో ఉన్న శీగేబాగి గ్రామంలో ఇలాంటి కఠినమైన కట్టుబాట్లే అమలవుతున్నాయి.
తుమకూరు(కర్ణాటక): శీగేబాగి గ్రామంలోని కురుబ కులస్తులకు ఆ సముదాయం పెద్దలు చెప్పిందే తీర్పు. పట్టుమని వెయ్యి మంది ఉండే ఊళ్లో ఈ వర్గీయులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడ గ్రామంలో ఇప్పటికి సంప్రదాయాల పేరుతో కుల పెద్దలు గీసిన లక్ష్మణరేఖను దాటడానికి ఎవరూ ధైర్యం చేయరు. మూడు సంవత్సరాల కిందట గ్రామంలోని కొందరు కురుబ పెద్దలు సముదాయం పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కట్టుబాట్లు విధించారు. కులంలోని వారికి సంబంధించి ఎక్కడ గొడవ జరిగినా పెద్దలు అక్కడికి వెళ్లి పంచాయతీ పెడతారు. తప్పు ఎవరిదో నిర్ధరించి వారికి జరిమానా విధిస్తారు. తప్పు తీవ్రమైనదైతే వారిని ఊరి నుంచి బహిష్కరించడం జరుగుతుంది. జీవితాంతం గ్రామంవైపు కన్నెత్తి చూడరాదు. ఒకవేళ తిరిగి వచ్చినా వారితో ఇతరులెవరూ మాట్లాడవద్దు. ఒక వేళ మాట్లాడినట్లు తెలిసిన వారికి అదేశిక్ష తప్పదు. ఇళ్ళలో ఉన్న చిన్న పిల్లలు చేసినా కూడ వారికి కూడ ఇదేశిక్ష తప్పదు. చిన్న పిల్లలు చేస్తే వారి పెద్దలకు జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి పాత కాలం పద్ధతులు ఇంకా మనుగడలో ఉండడం ఇక్కడ మాత్రమే చూడగలమేమో.
ప్రేమ వివాహానికి శిక్ష.. గ్రామ బహిష్కారం
ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఆమె రెండేళ్ల కిందట ఒక అగ్రవర్ణ యువకునితో ప్రేమపెళ్లిచేసుకుంది. గ్రామ పెద్దలు తండ్రి ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టారు. కొత్త దంపతులు ఊళ్లోకి అడుగుపెట్టరాదని, ఆమె తండ్రి కుటుంబంతో ఎవరూ మాట్లాడరాదని తీర్పు చెప్పారు. దీంతో ఎవరూ కూడా ఆ కుటుంబంతో మాట్లాడటం లేదు. ఇటీవలే ఆ వ్యక్తి మరణించగా, కడసారి చూడడానికి కూడా కూతురిని గ్రామం గడప తొక్కనివ్వలేదు. వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె తమ్ముణ్ని హెచ్చరించడం విశేషం. ఈ కట్టుబాట్లను ఎక్కువమంది సముదాయంవారు వ్యతిరేకిస్తున్నా పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.