సీపీఐ నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడని, ఆయన రేసులో ఉంటే, తన ఓటు ఆయనకే అని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
సాక్షి, చెన్నై : సీపీఐ నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడని, ఆయన రేసులో ఉంటే, తన ఓటు ఆయనకే అని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే తమకు ఆహ్వానం పలకడంతో ఆ దిశగా పొత్తు యత్నాల్లో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తుల్లో మునిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఆయన వ్యాఖ్యల్ని ఇతర నాయకులు తీవ్రంగా ఖండించే పనిలో పడ్డారు.
ఈ సమయంలో శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భూ ఏకంగా ఇళంగోవన్ సీఎం పదవికి అర్హుడని, ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయని వ్యాఖ్యానిం చడం కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల్లో మరిం త చర్చను వేడెక్కించింది. ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టే వాళ్లు ఓ వైపు ఉంటే, మరో వైపు ఏకంగా తాను కాదు...కమ్యూనిస్టు నేత నల్లకన్ను సీఎం పదవికి అర్హుడన్నట్టుగా ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం మరో చర్చకు తెరలేపినట్టు అయింది.
నల్లకన్నుకే ఓటు : కమ్యూనిస్టు సీని యర్ నేత నల్లకన్నుకు అంబేద్కర్ బిరుదును శని వారం రాత్రి ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ కమ్యూనిస్టు నేతను పొగడ్తల్లో ముంచెత్తారు. నల్లకన్నుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు, పొత్తులు ఎలా ఉంటాయో ఏమో తెలియదు గానీ, సీఎం పదవి రేసులో నల్లకన్ను ఉంటే తన మద్దతు ఓటు ఆయనకే అని వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తమ నాయకుడు అని వ్యాఖ్యానిస్తూ, ఆ పదవికి అర్హుడేనని స్పందించడంతో ఇప్పటికే ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థితత్వంపై సాగుతున్న చర్చ మరింత వేడెక్కినట్టు అయింది.