న్యూఢిల్లీ: సరైన ఆహారమే స్వైన్‌ఫ్లూకి అడ్డుకట్ట వేస్తోందని ఆరోగ్య రంగ నిఫుణలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ బారినపడి సుమారు 1,100 మంది మరణించారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే స్వైన్‌ఫ్లూకి దొరక్కుండా తప్పించుకోవచ్చని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ‘శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి స్వైన్‌ఫ్లూ సోకింది. దీనిని ఎదుర్కోవడంలో బలవర్ధకమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది’ అని న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ న్యూట్రీషియనిస్ట్ శిఖా శర్మ చెప్పారు. ‘ఆకలి తగ్గిపోవడం కూడా స్వైన్‌ఫ్లూ రోగ చిహ్నాల్లో ఒకటి.
అందుకని బలవంతంగా మాత్రం తినొద్దు. వీలైనప్పుడల్లా మిత ఆహారం తీసుకోండి. తాజా పండ్లు, కూరగాయలను తినడం ఉత్తమం. ఆపిల్, ద్రాక్ష వంటి పండ్ల రసాలు, క్యాబేజి, బచ్చలి ఆకు వంటి కూరగాయలు తీసుకోవాలి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కూరగాయల సూప్ తీసుకోవాలి. ఇతరులతో ఆహార పదార్థాలు, పానీయాలు పంచుకోవద్దు. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన అంశం’ అని ఆమె అన్నారు. ముఖ్యంగా విటమిన్-సి ఉండే ఆహార పదార్థాలను తినాలని పేర్కొన్నారు. అలాగే ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్, చేప, సోయాతో చేసిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని తెలిపారు.
క్యారెట్, ఉసిరి, బచ్చలి ఆకుతో చేసిన పండ్ల రసాలు తీసుకోవాలన్నారు. తద్వారా హెచ్1ఎన్1 వైరస్‌ను దీటుగా ఎదుర్కోవచ్చని చెప్పారు. అల్లం, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలను డైట్‌లో భాగంగా మలుచుకోవాలని పేర్కొన్నారు. ‘తులసి, వెల్లుల్లి, పసుపు వంటి మూలికలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లి ఈ వ్యాధి నిరోధకానికి తోడ్పాటునందిస్తుంది. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియాగా పసుపు కీలక పాత్ర పోషిస్తుంది’ అని వెయిట్ మానిటర్.కామ్ వెబ్‌సైట్ ఫౌండర్ ఇషీ ఖోస్లా తెలిపారు.
సరైన ఆహారంతో స్వైన్‌ఫ్లూకి చెక్
Published Sat, Mar 7 2015 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement