అస్తమించిన ఉదయకిరణం..!
అస్తమించిన ఉదయకిరణం..!
Published Mon, Jan 6 2014 11:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
హంసతూలికా తల్పాలపై శయనం... అడుగులకు మడుగులొత్తే పరివారం... ఖరీదైన కార్లు... విలాసవంతమైన జీవితం... సినీతారలపై సామాన్యుడి అభిప్రాయం ఇది. ఈ అభిప్రాయం కొందరి విషయంలోనే కరెక్ట్ అని, అందరి జీవితాలూ అలా ఉండవని చాలామందికి తెలీదు. సినీతారలకూ కష్టాలుంటాయి. ఆ మాటకొస్తే... సామాన్యుడి కంటే బలమైన కష్టాలుంటాయి. కాని, ఎన్నికష్టాలు ఎదురైనా మొహంలో చిరునవ్వు చెరగకూడదు. ఆహార్యంలో దర్పం తగ్గ కూడదు. కెమెరా ముందే కాదు, నిజజీవితంలో కూడా నటించాలి. నటులకు రంగుల ప్రపంచం పెట్టిన శాపం అది. ఏక్షణాన్నైనా జనాలకు సాధారణంగా కనిపించాల్సి వస్తే.. ‘ఇమేజ్ డామేజ్ అవుతుందేమో’ అనే అభద్రతాభావం. ఈ కష్టాల కడలిలో ఎదురీదేవారు కొందరైతే... కొట్టుకుపోయేవారు మరికొందరు. ఇదే సినీ తారల జీవితం..!
ఉదయ్‌కిరణ్.. ఉరి వేసుకుని చనిపోయాడు’. సోమవారం పొద్దున్నే టీవీల్లో కథనాలు. ఇది నిజం కాకపోతే ఎంతబావుణ్ణో అనుకున్నారంతా. 34 ఏళ్లంటే... చాలా చిన్న వయసు. అసలు జీవితమంతా ముందే ఉంది. కానీ తొందరపడిపోయాడు. చేయరాని అఘాయిత్యం చేశాడు. అంత కష్టం తనకేమొచ్చింది? ప్రతిఒక్కరి మనసులో ఇదే ప్రశ్న. విలువకట్టలేని జీవితాన్నే నిర్దాక్షిణ్యంగా ఓ వ్యక్తి అంతం చేసుకున్నాడంటే... ఎంతటి మానసిక క్షోభకు గురై ఉండాలి? జీవితంపై ఎంతటి విరక్తికి లోనై ఉండాలి? కారణాలను శోధించడంలో ఓ వైపు పోలీసులు నిమగ్నమై ఉన్నారు.
ఏది ఏమైనా... సినీ వినీలాకాశంలో వెలిగిన ఓ యువతార నేలరాలింది. అలుముకుంటున్న తాత్కాలిక చీకట్లకు భయపడి, రానున్న ఉదయకిరణాల గురించి ఆలోచించకుండా.. ఆ యువతార దూరంగా పారిపోయింది. మనసున్న ప్రతి మనిషినీ కలచివేసిన విషయం ఇది. ‘బాబూ... బాబూ...’ అంటూ తన చుట్టూ తిరిగిన సినీలోకం ఒక్కసారిగా తనను ఏకాకిని చేసిందే అనే ఆవేదన కావచ్చు. ఆర్థికబాధలకు తలొగ్గలేక, జీవనశైలిని మార్చుకోలేక చేసిన తెగింపు కావచ్చు. కుటుంబ సమస్యలు కావచ్చు.. క్షణికావేశం కావచ్చు... ఇవన్నీ కర్ణుడి శాపాల మాదిరిగా ఉదయ్‌కిరణ్‌ని వెంటాడాయి. అతని ఉజ్వల భవిష్యత్తుని కూకటివేళ్లతో పెకలించాయి.
‘నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరితే నిబిడాశ్చర్యంతో వీరే... నెత్తురు కక్కుతూ నేలకు నే రాలితే నిర్దయతో వీరే’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. దానికి ఉదయ్‌కిరణ్ జీవితమే ఓ పెద్ద ఉదాహరణ. ఆయన కెరీర్‌ని ఒక్కసారి విశ్లేషిస్తే.. ఉత్థానపతనాలంటే ఏంటో అవగతమవుతాయి. సినిమాకు ఎంతమంది ప్రతిభావంతులు పనిచేసినా విజయం తాలూకు ఫలితాన్ని ఎక్కువ శాతం పొందేది హీరో. ఆ క్షణంలో హీరో అనుభవించే ఆనందం అనిర్వచనీయం. అలాంటి సంతోషాన్ని 19ఏళ్ల వయసులో... తన తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు ఉదయ్‌కిరణ్. ఆయన తొలి సినిమా తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’. యువ తరం ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే... ఉదయ్‌కిరణ్ ఆ ‘చిత్రం’లో కాస్త పీలగా కనిపించాడు. దాంతో కొందరు అతణ్ణి చూసి పెదవి విరిచారు.
‘చిత్రం’ వచ్చిన ఏడాదిన్నర తర్వాత ‘నువ్వు-నేను’తో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఉదయ్‌కిరణ్. పరిపూర్ణమైన శారీరక సౌష్టవంతో కనిపించిన ఉదయ్‌కిరణ్‌ని చూసి తెలుగు తెరకు మంచి హీరో దొరికాడని కితాబులిచ్చేసింది ప్రేక్షకలోకం. వెంటనే ‘మనసంతా నువ్వే’ రూపంతో మరో హ్యాట్రిక్ హిట్. ఇక భవిష్యత్తంతా ఉదయ్‌కిరణ్‌దే అనేశారు. నిర్మాతలు బ్లాంక్ చెక్కులతో ఎగబడ్డారు. అయితే... కొన్ని పరిణామాల వల్ల కావచ్చు, స్వయంకతం వల్ల కావచ్చు, తొందరపాటు తనం వల్ల కావచ్చు, లేక గ్రహచారం కావచ్చు... అతని జీవితంలో అనుకోని బ్యాడ్ పీరియడ్ మొదలైంది.
తాను నటించిన సినిమాల సక్సెస్ రేట్లు కూడా క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం చిత్రాలు ఏవరేజ్‌గా ఆడాయి. అక్కడ్నుంచి పరాజయాల పరంపర. విడుదలైన ప్రతిసినిమా ఫ్లాపై ఉదయ్ కెరీర్‌ని కబళించి వేశాయి. కొన్నేళ్ల క్రితం తాను తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రితో కూడా దూరంగా ఉంటున్నాడు. ఇన్ని కష్టాల్లో కూడా తాను ఒంటరిపోరాటం చేస్తూనే ఉన్నాడు. తాను నటించిన చిత్రాలు ఫ్లాపులు అవుతున్నా... ఏనాడూ ఆత్మసై ్థర్యాన్ని వీడలేదు. ఈ క్రమంలోనే ఆయన చేసిన తమిళ చిత్రం బాలచందర్ ‘పోయ్’. తెలుగులో ఈ సినిమా ‘అబద్ధం’గా విడుదలైంది. ఆ సినిమా నటుడిగా ఉద య్‌కిరణ్ ఏంటో దక్షిణాది ప్రేక్షకులకు తెలియజేసింది. ‘అబద్ధం’ ఆర్థికంగా విజయం సాధించకపోయినా, ఉదయ్‌కిరణ్‌ని తమిళ ప్రేక్షకులకు మాత్రం చేరువ చేసింది.
ఆ సినిమా తర్వాత రెండు తమిళ చిత్రాల్లో నటించారాయన. 2012 అక్టోబర్ 24న విషితతో ఆయన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అయినా... ఆయన కెరీర్ బాగుంటుందని అందరూ భావించారు. గత ఏడాది ‘జై శ్రీరామ్’ సినిమా చేశారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా. దీంతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా నిరాశ పరిచింది. ఆ తర్వాత మరో సినిమా మొదలు పెట్టారు కానీ, అది అర్ధంతరంగా ఆగిపోయింది. మొత్తం 16 తెలుగు సినిమాలు, 3 తమిళ చిత్రాల్లో నటించిన ఉదయ్‌కిరణ్... గట్టిగా ప్రయత్నిస్తే... భవిష్యత్తులో తప్పకుండా మళ్లీ విజయం సాధిస్తాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో... ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకొని తాను తనువుచాలించడం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి లోను చేసింది.
జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తుంటే... తెలుగు చిత్ర పరిశ్రమకు కాలం కలిసి రావడం లేదేమో అనిపిస్తోంది. ఏదో శాపానికి గురైనట్లు ్ల... నెలకు ఓ సినీ ప్రముఖుడు చనిపోవడం పలువుర్ని ఆశ్చర్యానికి లోను చేస్తోంది. 2013 అక్టోబర్ 9న శ్రీహరి, 2013 నవంబర్ 8న ఏవీఎస్, 2013 డిసెంబర్ 7న ధర్మవరపు సుబ్రహ్మణ్యం... ఇలా వరుస మరణాలు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి లోనుచేశాయి. 2014 నుంచైనా తెలుగు సినిమాకు మంచి జరగాలని, ఏ ఒడిదుడుకూ లేకుండా పరిశ్రమ విజయవంతంగా ముందుకు సాగాలని అందరూ భావిస్తున్న తరుణంలో ఏడాది మొదలై వారం కూడా కాక ముందే... జనవరి 6న ఉదయ్‌కిరణ్ బలవన్మరణం అందరినీ ఆందోళనకు లోను చేస్తున్న విషయం. ఉదయ్‌కిరణ్ కుటుంబసభ్యులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చింది. మంగళవారం ఆయన అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి.
2012 అక్టోబర్ 24న విషితతో ఆయన వివాహం
జరిగింది. ఇది ప్రేమ వివాహం. ఇరు పక్షాల పెద్దల సమ్మతితో చాలా నిరాడంబరంగా ఈ పెళ్లి వేడుక జరుపుకున్నారు. పెళ్లి తర్వాత అయినా... ఆయన కెరీర్ బాగుంటుందని అందరూ భావించారు.
Advertisement
Advertisement