
రాష్ట్రంలో ఎస్మా
బెంగళూరు : రాష్ట్రపతి అంగీకారంతో కర్ణాటకలో ‘ఎస్మా’ చట్టం అమల్లోకి వచ్చిం దని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. ఎస్మాను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ప్రయోగించబోదని, అయితే ప్రభుత్వ అమ్ముల పొదిలో ఒక అస్త్రంగా మాత్రం ఉండనుందని తెలిపారు. మంగళవారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వైద్యులు, ఉపాధ్యాయుల నిరసనకు దిగిన సందర్భంలో ఎస్మా చట్టం అమల్లో లేక పోవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే ఎస్మా చట్టం ఇక పై అమల్లో ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో వారం లోపు పిటీషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పోస్టు ప్రస్తుతానికి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మంత్రిమండలి పునఃవ్యవస్థీకరణ, విస్తరణకు సంబంధించి హై కమాండ్‌తో సీఎం సిద్ధరామయ్య చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తే తనకు అభ్యంతరం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి టీ.బీ జయచంద్ర సమాధానం చెప్పారు.