మూడో రోజు సోదాలు, ఆ డైరీలో ఏముంది?
న్యూఢిల్లీ: కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ నివాసంలో మూడోరోజు శుక్రవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఏరియాలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల ఘటనపై మంత్రి సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఐటీ శాఖ అధికారులు 70 చోట్ల దాడులు చేశారని, అయితే మంత్రి శివకుమార్ గానీ, ఆయన బంధువుల ఇళ్లల్లో ఎలాంటి నగదు లభించలేదన్నారు. తమకు అండగా ఉన్నామని, మద్దతు తెలుపుతూ పార్టీ సీనియర్లు ఫోన్లు చేశారన్నారు. ఇదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని డీకే సురేశ్ వ్యాఖ్యానించారు.
ఆ డైరీలో ఏముంది?
బెంగళూరులో మంత్రి డీకే రవికుమార్ ఇంట్లో సోదాల్లో ఒక డైరీ లభించినట్లు సమాచారం. అందులో వివిధ పేర్లు పొడి అక్షరాల్లో ఉన్నట్లు, వారికి ఎంతెంత నగదు ఇచ్చిందీ వివరంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఐటీ దాడులు ఈగల్టన్ రిసార్టులో ప్రారంభమైన వెంటనే మంత్రి రెండు కాగితాలను చించి వేయగా వాటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కాగితపు ముక్కలు సదరు డైరీలోనివేనని ఆదాయపు పన్నుశాఖ అధికారులు చెబుతున్నారు.
నిన్న కూడా మంత్రి రవికుమార్ మామ తిమ్మయ్య ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఇక మరో అధికారుల బృందం డీకే బావమరిది సత్యనారాయణ ఇంట్లో గాలింపు జరిపారు. ఆభరణాల కొనుగోళ్లకు సంబంధి బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్లులతో గురువారం మంత్రి బావమరిది సత్యనారాయణతో పాటు ఆయన భార్యను నగరంలోని నగల దుకాణాలకు తీసుకెళ్లి బిల్లులను పరిశీలించారు. వాటి ప్రకారం రెండు బ్యాగుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లి ఇద్దరినీ విచారించి, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అదేవిధంగా మంత్రి డీ.కే.శివ మామ తిమ్మయ్య ఆప్తుడు ఎడ్విన్‌ను ఐటీ శాఖ అదుపులోకి తీసుకుంది. కాగా మంత్రి మామ తిమ్మయ్య ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో ఇంటి బయటకు వచ్చి ఐటీ అధికారులు తమకు ఎటువంటి ఇబ్బంది కలిగంచలేదని వారు విధులు వారు నిర్వరిస్తున్నారని వ్యాఖ్యలు చేసి ఇంట్లోకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా తిమ్మయ్య ఇంటి నుంచి వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు రూ.60 లక్షల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.