Karnataka Minister DK Shivakumar
-
నేలమాళిగల్లో భారీ ఎత్తున నగదు
బెంగళూరు: కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్, అతని బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల జరుపుతున్న సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఆప్తులు, మిత్రులు, వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలో పదుల సంఖ్యలో లాకర్లు, నేలమాలిగల్లో వందల సంఖ్యల స్థిర, చరాస్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, నగదు బయటపడుతున్నాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజుల నుంచి డీకే శివకుమార్‌కు సంబంధించిన వారి ఇళ్లలో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 7:30 గంటల నుంచి బెంగళూరు, మైసూరు, హాసన్ తదితర నగరాల్లో దాదాపు 64 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఆయన వ్యాపార భాగస్వామి, శర్మా ట్రావెల్స్ పేరుతో వివిధ చోట్లకు బస్సులను నడుపుతున్న అనిల్‌కుమార్‌శర్మకు చెందిన ఇంట్లో 16 లాకర్లు, ఒక నేల మళిగ ఉన్న గదిని అధికారులు గుర్తించారు. వాటి నుంచి వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక డీకే శివకుమార్ ఆప్తులైన వినయ్ కార్తీక్, ఎమ్మెల్సీ రవి, ద్వారకనాథ్, సచిన్నారాయణ, బాలాజీ సుభేష్, తిమ్మయ్య తదితర ఇళ్ల నుంచి పదుల కిలోల బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలను అనుసరించి డీకే శివకుమార్ విదేశాల్లో కూడా కొన్ని వ్యాపారాలు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మనీల్యాండరింగ్‌పై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఐటీ సోదాల్లో దొరికిన ఆధారాలతో ఐటీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు త్వరలో రెండు మూడు రోజుల్లో నివేదిక పంపించనున్నట్లు సమాచారం. కాగా నాలుగో రోజు కూడా మంత్రి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. -
మూడో రోజు సోదాలు, ఆ డైరీలో ఏముంది?
న్యూఢిల్లీ: కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ నివాసంలో మూడోరోజు శుక్రవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఏరియాలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల ఘటనపై మంత్రి సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఐటీ శాఖ అధికారులు 70 చోట్ల దాడులు చేశారని, అయితే మంత్రి శివకుమార్ గానీ, ఆయన బంధువుల ఇళ్లల్లో ఎలాంటి నగదు లభించలేదన్నారు. తమకు అండగా ఉన్నామని, మద్దతు తెలుపుతూ పార్టీ సీనియర్లు ఫోన్లు చేశారన్నారు. ఇదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని డీకే సురేశ్ వ్యాఖ్యానించారు. ఆ డైరీలో ఏముంది? బెంగళూరులో మంత్రి డీకే రవికుమార్ ఇంట్లో సోదాల్లో ఒక డైరీ లభించినట్లు సమాచారం. అందులో వివిధ పేర్లు పొడి అక్షరాల్లో ఉన్నట్లు, వారికి ఎంతెంత నగదు ఇచ్చిందీ వివరంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఐటీ దాడులు ఈగల్టన్ రిసార్టులో ప్రారంభమైన వెంటనే మంత్రి రెండు కాగితాలను చించి వేయగా వాటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కాగితపు ముక్కలు సదరు డైరీలోనివేనని ఆదాయపు పన్నుశాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న కూడా మంత్రి రవికుమార్ మామ తిమ్మయ్య ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఇక మరో అధికారుల బృందం డీకే బావమరిది సత్యనారాయణ ఇంట్లో గాలింపు జరిపారు. ఆభరణాల కొనుగోళ్లకు సంబంధి బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్లులతో గురువారం మంత్రి బావమరిది సత్యనారాయణతో పాటు ఆయన భార్యను నగరంలోని నగల దుకాణాలకు తీసుకెళ్లి బిల్లులను పరిశీలించారు. వాటి ప్రకారం రెండు బ్యాగుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లి ఇద్దరినీ విచారించి, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అదేవిధంగా మంత్రి డీ.కే.శివ మామ తిమ్మయ్య ఆప్తుడు ఎడ్విన్‌ను ఐటీ శాఖ అదుపులోకి తీసుకుంది. కాగా మంత్రి మామ తిమ్మయ్య ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో ఇంటి బయటకు వచ్చి ఐటీ అధికారులు తమకు ఎటువంటి ఇబ్బంది కలిగంచలేదని వారు విధులు వారు నిర్వరిస్తున్నారని వ్యాఖ్యలు చేసి ఇంట్లోకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా తిమ్మయ్య ఇంటి నుంచి వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు రూ.60 లక్షల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఐటీ దాడులపై స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు : ఐటీ దాడులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తమ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని, తమను బదనాం చేసేందుకే దాడులు చేశారని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ నివాసాలపై ఐటీ శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే శివకుమార్, సురేశ్ సోదరులు, బంధువుల ఇళ్లతో పాటు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బసచేసిన ఈగల్ టన్ రిసార్ట్‌లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టారు. కాగా ఐటీ సోదాల్లో సుమారు 7.5 కోట్ల నగదు పట్టుబడినట్లు సమాచారం. ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ...కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేసి, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. -
మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు
బెంగళూరు : కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేష్ నివాసాలపై ఐటీ శాఖ దాడి చేసింది. ఐటీ అధికారులు బుధవారం ఉదయం మంత్రి శివకుమార్, ఎంపీ నివాసాలతో పాటు, ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టులోనూ సోదాలు చేపట్టింది. కాగా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈగల్టన్ రిసార్ట్‌లోనే బస చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపుతోందంటూ 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించారు. ఈ ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను మంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు, రిసార్టులో ఐటీ శాఖ దాడులు చేయడం గమనార్హం. సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.