
మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ నివాసంపై ఐటీ శాఖ దాడి చేసింది.
బెంగళూరు : కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేష్ నివాసాలపై ఐటీ శాఖ దాడి చేసింది. ఐటీ అధికారులు బుధవారం ఉదయం మంత్రి శివకుమార్, ఎంపీ నివాసాలతో పాటు, ఈగల్‌టన్ గోల్ఫ్ రిసార్టులోనూ సోదాలు చేపట్టింది. కాగా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈగల్‌టన్ రిసార్ట్‌లోనే బస చేసిన విషయం తెలిసిందే.
రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపుతోందంటూ 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్ రిసార్ట్‌కు తరలించారు. ఈ ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను మంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు, రిసార్టులో ఐటీ శాఖ దాడులు చేయడం గమనార్హం. సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.