నేలమాళిగల్లో భారీ ఎత్తున నగదు
బెంగళూరు: కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్, అతని బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల జరుపుతున్న సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఆప్తులు, మిత్రులు, వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలో పదుల సంఖ్యలో లాకర్లు, నేలమాలిగల్లో వందల సంఖ్యల స్థిర, చరాస్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, నగదు బయటపడుతున్నాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజుల నుంచి డీకే శివకుమార్‌కు సంబంధించిన వారి ఇళ్లలో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా శుక్రవారం ఉదయం 7:30 గంటల నుంచి బెంగళూరు, మైసూరు, హాసన్ తదితర నగరాల్లో దాదాపు 64 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఆయన వ్యాపార భాగస్వామి, శర్మా ట్రావెల్స్ పేరుతో వివిధ చోట్లకు బస్సులను నడుపుతున్న అనిల్‌కుమార్‌శర్మకు చెందిన ఇంట్లో 16 లాకర్లు, ఒక నేల మళిగ ఉన్న గదిని అధికారులు గుర్తించారు. వాటి నుంచి వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక డీకే శివకుమార్ ఆప్తులైన వినయ్ కార్తీక్, ఎమ్మెల్సీ రవి, ద్వారకనాథ్, సచిన్‌నారాయణ, బాలాజీ సుభేష్, తిమ్మయ్య తదితర ఇళ్ల నుంచి పదుల కిలోల బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలను అనుసరించి డీకే శివకుమార్ విదేశాల్లో కూడా కొన్ని వ్యాపారాలు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మనీల్యాండరింగ్‌పై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఐటీ సోదాల్లో దొరికిన ఆధారాలతో ఐటీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు త్వరలో రెండు మూడు రోజుల్లో నివేదిక పంపించనున్నట్లు సమాచారం. కాగా నాలుగో రోజు కూడా మంత్రి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.